పని చూస్కో.. గంగూలీ పై మాజీ చీఫ్ సెలెక్టర్ మండిపాటు

Update: 2021-12-23 09:31 GMT
ఇప్పుడంటే ఎవరికీ గుర్తుండకపోవచ్చు గానీ.. 1980ల్లో అతడో గొప్ప బ్యాట్స్ మన్. డాషింగ్ ఆటగాడిగా పేరు. సునీల్ గావస్కర్ తర్వాత ముంబై నుంచి వచ్చిన మరో అద్బుత బ్యాట్స్ మన్. టీమిండియా కెప్టెన్ గానూ వ్యవహరించాడు. క్లాస్ బ్యాటింగ్ తో భారత క్రికెట్ చరిత్రలో నిలిచి పోయాడు. ఆటలో ఎంత దూకుడుగా ఉంటారో మాటలోనూ అంతే. క్రికెటర్ గా కెరీర్ ముగిశాక క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి వచ్చారు. తర్వాత భారత చీఫ్ సెలక్టర్ అయ్యారు. తన పదవీ కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలతో ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను మలుపు తిప్పాడు. అతడే దిలీప్ వెంగ్‌సర్కార్.

వెంగీ అంటే ఆ రోజుల్లో అదో క్రేజ్..

తన స్ట్రోక్ ప్లే బ్యాటింగ్ అత్యుత్తమంగా ఉండేది. 1976 నుంచి 1992 వరకు భారత టెస్టు జట్టు సభ్యడైన వెంగీ 116 టెస్టులాడి 6,868 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కేవలం 11 మంది భారత క్రికెటర్లే 100 టెస్టులాడారు. వీరిలో ఏడుగురే బ్యాట్స్ మన్. వారిలో వెంగీ ఒకరు. దీన్నిబట్టే అతడి స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. చీఫ్ సెలక్టర్ గా ఉన్నప్పడు తన నిర్ణయాలు కూడా డైనమిక్ గా ఉండేవి. 2006 దక్షిణాఫ్రికా టూర్ కు పేసర్ శ్రీశాంత్ ఎంపిక నిర్ణయం ఇలాంటిదే.

అప్పటికి పెద్దగా ఫామ్ లోలేని శ్రీశాంత్ పై నమ్మకం ఉంచి తిరిగి టీమిండియాలోకి తీసుకున్నారు వెంగీ. నాటి టూర్ లో శ్రీశాంత్ అద్భుతంగా రాణించి వెంగీ నిర్ణయానికి న్యాయం చేశాడు.అలాంటి రికార్డున్న వెంగీ.. తాజాగా బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సెలక్షన్ కమిటీ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ జోక్యం చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ మండిపడ్డారు.

"గంగూలీకి సెలక్షన్ కమిటీ తరపున మాట్లాడే హక్కు లేదు. అతడు బీసీసీఐ అధ్యక్షుడు, అతడికి సెలక్షన్ కమిటీలో జోక్యం చేసుకోనే అవసరం లేదు. జట్టు సెలెక్షన్ లేదా కెప్టెన్సీ గురించి ఏదైనా సమస్య ఉంటే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మాట్లాడాలి’’ అని అన్నారు. కోహ్లి విషయం ముందే గంగూలీకి తెలుసు. టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. విరాట్ వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. సెలక్షన్ కమిటీ ద్వారా కెప్టెన్‌ని ఎంపిక చేస్తారు లేదా తొలగిస్తారు. అది గంగూలీ అధికార పరిధి కాదు. 1932 నుంచి (తొలి భారత జట్టు ఎంపికైనప్పటి నుంచి) ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు మారాలి. కోహ్లి భారత క్రికెట్ కోసం చాలా కష్టపడ్డాడు. అతడి పట్ల మీరు వ్యవహరించిన తీరు సరైనదికాదు. అది కచ్చితంగా కోహ్లిని బాధించి ఉంటుంది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు.

సెలక్షన్ కమిటీ తరఫునా గంగూలీనా మాట్లాడేది?

'సెలక్షన్ కమిటీ తరపున సౌరవ్ గంగూలీ మాట్లాడే ప్రసక్తే లేదని.. అతడు బీసీసీఐ అధ్యక్షుడని.. సెలెక్షన్ లేదా కెప్టెన్సీ విషయంలో సెలక్షన్ కమిటీ అధినేత మాట్లాడి ఉండాల్సింది' అని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. జాతీయ సెలెక్టర్ల తరపున విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంశంపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడి ఉండాల్సిందని పేర్కొన్నారు. ‘‘సెలక్షన్ కమిటీ తరపున సౌరవ్ గంగూలీ మాట్లాడే ప్రసక్తే లేదని.. అతడు బీసీసీఐ ప్రెసిడెంట్.. సెలక్షన్ లేదా కెప్టెన్సీ విషయంలో సెలక్షన్ కమిటీ హెడ్ చేతన్ శర్మ మాట్లాడి ఉండాల్సింది” అని అన్నాడు.

టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత, పరిమిత, సుధీర్ఘ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల ప్రయోజనం లేదని, రోహిత్ శర్మను వన్డే జట్టుకు కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించినట్లు గంగూలీచెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. కెప్టెన్‌ని ఎంపిక చేయడం లేదా తొలగించడం సెలక్షన్ కమిటీ నిర్ణయమని, అది గంగూలీ పరిధిలోకి రాదని అన్నాడు. దీన్నిబట్టి చూస్తే కోహ్లి కెప్టెన్సీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లిని తప్పించి రోహిత్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత మంది తప్పుపడుతుంటే, కొంత మంది సమర్ధిస్తున్నారు.

Tags:    

Similar News