జయారెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్

Update: 2018-10-06 09:16 GMT
తూర్పు జయారెడ్డి.. నెల కిందటి వరకూ ఈ పేరు ఎవ్వరికీ తెలియదు.. కానీ ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్. సంగారెడ్డి అసెంబ్లీలో ప్రచారంతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. జనాలను తన మెస్మరైజింగ్ ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. ఈ యంగ్ లేడి ఎవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అదే జగ్గారెడ్డి కూతురు..  జగ్గారెడ్డి 2004 నాటి మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం.. తదనాంతర పరిణామాల్లో విచారణ ఎదుర్కొంటుండడంతో నాన్న కోసం కూతురు కదిలివచ్చింది. జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహించే సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికి వేసుకుంది.

జగ్గారెడ్డి కేసుల ఉచ్చులో ఉండడంతో ఆయన కూతురు జయారెడ్డి ఇప్పుడు కాలనీలు, గ్రామాలకు వెళ్లి నియోజకవర్గంలో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ క్యాడర్ టీఆర్ఎస్ లోకి జారిపోకుండా వారితో కలిసి ప్రచార పర్వాన్ని ఉరకలెత్తిస్తోంది. జగ్గారెడ్డి భార్య, తల్లి అయిన నిర్మలతో కలిసి నియోజకవర్గం మొత్తం ప్రచారంతో చుట్టేస్తోంది.

ప్రస్తుతం జగ్గారెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కేసు దృష్ట్యా విచారణను ఎదుర్కొంటున్నారు. పోలీస్ అధికారుల సూచనలు, డాక్టర్ల సూచనమేరకు హైదరాబాద్ విడిచి వెళ్లడం లేదు. దీంతో నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ఆయన కూతురు జయారెడ్డి అన్నీ తానై విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది..

జయరెడ్డి ఇటీవలే బిజినెస్ మేనేజ్ మెంట్ లో బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేశారు. నిజానికి జగ్గారెడ్డి తన తర్వాత భార్య నిర్మలా రెడ్డినే రాజకీయాల్లో ఫోకస్ చేశారు. నిర్మలా రెడ్డి ఉమ్మడి మెదక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. కానీ కూతురు జయారెడ్డికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి దృష్ట్యా ప్రస్తుతం ప్రచార బాధ్యతను ఆమెకు అప్పజెప్పారు. ప్రచారంలో జయారెడ్డి తన తండ్రిని టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసి జైలు పాలు చేసిందంటూ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ సానుభూతి పొందుతోంది. బిజినెస్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేసినా జయారెడ్డి తన మాటతీరు.. ప్రసంగాలతో సంగారెడ్డి నియోజకవర్గంలోని క్లాస్ , మాస్ ప్రజలను ఆకర్షిస్తోందట..

తండ్రిలానే కూతురు జయారెడ్డి కూడా అధికార టీఆర్ఎస్ పై పదునైన విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. తండ్రిని మరిపిస్తోందని అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తండ్రి జగ్గారెడ్డి, కూతురు జయారెడ్డి లు ఇద్దరూ జులై 7వ తేదీన పుట్టడం విశేషం. అందుకే తండ్రి పోలీకలు చాలా వచ్చాయని.. తండ్రికి తగ్గ తనయ అని స్థానిక నేతలు కొనియాడుతున్నారు.
    

Tags:    

Similar News