సడెన్ గా మార్గదర్శి మీద పడ్డ వైసీపీ...రీజనేంటి....?

Update: 2022-11-16 02:30 GMT
మార్గదర్శి సంస్థకు అరవై ఏళ్ల చరిత్ర ఉంది.  ఈ రోజుకు అప్రతిహతంగా మార్గదర్శి సాగిపోతూ ఉంది. దాని మీద కోర్టు కేసులు ఆరోపణలు ఎన్ని ఉన్నా కూడా జనాదరణలో అయితే ఎక్కడ  తేడా లేదు. అయితే మార్గదర్శి మీద అలుపెరగని పోరాటాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేపడుతున్నారు. లేటెస్ట్ గా సుప్రీం కోర్టు మార్గదర్శి కేసులో రామోజీరావుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ దశలో ఉంది.

ఏపీ సర్కార్ కూడా ఉండవల్లి పిటిషన్ విషయంలో తాను కూడా ఇంప్లీడ్ అయింది. మొత్తానికి చూస్తే నాటి వైఎస్సార్ మాదిరిగా నేడు జగన్ కూడా ఉండవల్లికి ఈ కేసు వరకూ సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసు విషయం మీద మాట్లాడుతూ తాను బతికి ఉండగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా అని ఆవేదన చెందారు. అదే టైం లో రామోజీరావు ఈ కేసు విషయంలో స్టే తెచ్చుకోకుండా ఏపీ సర్కార్ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.

ఆ విషయం అలా ఉంచితే ఈ మధ్య ఈనాడులో వైసీపీ వ్యతిరేక వార్తలు ఎక్కువ అయ్యాయి.  కొన్ని నెలలకు ముందు వరకూ  న్యూట్రల్ పంధాను అనుసరించిన ఈనాడు మేనేజ్మెంట్ ఇపుడు ప్రభుత్వం మీద గట్టిగానే వార్తలు వేస్తోంది. అవి బ్యానర్ ఐటెమ్స్ గా ఉంటున్నాయి. దాంతో పాటు ఇటీవల మరో కీలక పరిణామం జరిగింది. అదేంటి అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా రామోజీరావు వద్దకు వెళ్ళి నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన భేటీ వేశారు అన్న వార్త అయితే వినిపించింది.

ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ వైసీపీ ఒక రాజకీయ పక్షంగా అన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తుంది కాబట్టి ఇది కూడా అలెర్ట్ చేసి ఉండాలని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో వరసబెట్టి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేస్తోంది. అయితే కేవలం మార్గదర్శి అని కాకుండా శ్రీరాం,  కపిల్ చిట్ సంస్థలలో కూడా సోదాలు చేపట్టింది.

ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పలు కీలకమైన అంశాల మీద ఆరా తీశారు అని చెబుతున్నారు. ఈ చిట్ ఫండ్స్ ద్వారా సేకరించిన మొత్తలాను నేరుగా చిట్ పాడుకున్న సభ్యులకు ఇవ్వకుండా వాటిని ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయించి ఆ సొమ్ము తమ వద్దనే ఉంచుకుని వేరే వాటికి ఆ నిధులను మళ్ళిస్తున్నారు అన్న ఆరోపణలటోన్  స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు టార్గెట్ చేశారు అని  అంటున్నారు.

ఇలా నిబంధలనకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయని,   ఇలాంటి ఆరోపణల నేపధ్యంలో వాటి ఆధారంగా ఈ సోదాలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేస్తున్నారు అని అంటున్నారు.  నిజానికి ఈ ఆరోపణలు నిజమైతే అది రిజర్వ్ బ్యాంక్ నిబంధనల  మేరకు తప్పు అని చెప్పాలి.

ఉండవల్లి కూడా ఇదే వాదన మీద కోర్టుకు వెళ్లారు. మరి ఇపుడు ఈ సోదాల వల్ల ఏమి తేలుస్తారు అన్నదే ఆసక్తికరమైన అంశంగా ఉంది. మరో వైపు ఈనాడు సంస్థ విషయంలో వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇపుడు దూకుడుని పెంచి ఈ విధంగా సోదాలతో కధ మొదలెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఇది ఎంతవరకూ వెళ్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News