ఊగిసలాటకు చెక్.. గంభీర్ రెండో ఇన్నింగ్స్

Update: 2019-03-22 09:29 GMT
భారత మాజీ క్రికెటర్  గౌతం గంభీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ మధ్య రాజకీయ, జాతీయ అంశాలపై తన దైన శైలిలో గళం వినిపిస్తున్న గంభీర్ తాజాగా రాజకీయాల్లోకి అడుగులు వేశారు. తాజాగా గంభీర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ ల సమక్షంలో గౌతం గంభీర్ బీజేపీలో చేరారు. పార్టీ సభ్యత్వాన్ని  తీసుకున్నారు.

గత కొద్దీ రోజులుగా బీజేపీ అధిష్టానం దేశంలోని ప్రముఖులకు గాలం వేస్తోంది. క్రికెటర్లు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులను బీజేపీలో చేరి పోటీచేయాలని కోరుతోంది. అందులో భాగంగానే గంభీర్ ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పి చేరిపోయారు.

ప్రస్తుతం న్యూఢిల్లీ పరిధిలో మొత్తం 7 లోక్ సభ సీట్లలో ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి గంభీర్ ను పోటీచేయించాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీలోని రాజేంద్రనగర్ ప్రాంతం గౌతం గంభీర్ స్వస్థలం. ఈయనకు ఇదే సీటును బీజేపీ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సీటులో బీజేపీ ఎంపీనే ఉన్నారు. గడిచిన సారి మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి బీజేపీ తరుఫున గెలిచారు. ఈసారి ఆమెకు బదులు గంభీర్ కు టికెట్ ఇవ్వవచ్చని సమాచారం.

2014 ఎన్నికల్లో బీజేపీ న్యూఢిల్లీ పరిధిలోని 7 లోక్ సభ స్థానాలకు ఏడింటిని గెలిచింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అభ్యర్థులను ధీటైన వారిని బరిలోకి దించాలనే గంభీర్ ను నిలుపుతోంది బీజేపీ.  

గౌతం గంభీర్ 2003 ఏప్రిల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 147 వన్డేలు ఆడాడు. 58 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 22 అర్ధసెంచరీలు, తొమ్మిది సెంచరీలను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రాణించాడు. ఇప్పుడు క్రికెట్ లో శకం ముగిసిపోవడంతో రాజకీయ అడుగులు వేస్తున్నాడు.

Tags:    

Similar News