పొలిటిక‌ల్ కెరీర్ ను దెబ్బ‌తీసేసుకున్న మాజీ క్రికెట‌ర్?

Update: 2021-09-30 01:30 GMT
రాజ‌కీయాల్లో రాణించాల‌నుకునే వాళ్ల‌కు కొద్దో గొప్పో అయినా ఓపిక ఉండాలి. అయితే.. మాజీ క్రికెట‌ర్ న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు ఇలాంటిది మ‌చ్చుకైనా లేన‌ట్టుగా ఉంది. సిద్ధూ ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి చాలాకాలం అయితే అయ్యింది కానీ, అత‌డు చాలా కాలం పాటు బీజేపీలో కొన‌సాగాడు. పంజాబ్ లో బీజేపీ ఎప్పుడూ బ‌లంగా లేదు. కాబ‌ట్టి.. ఆయ‌న‌కు అనుకున్న ఫ‌లాలు అంద‌లేదు. అయితే బీజేపీ త‌ర‌ఫున ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చాడు సిద్ధూ.

ఇక బీజేపీ పంజాబ్ లో ఎదిగే అవ‌కాశం లేదు, శిరోమ‌ణితో ఆ పార్టీ పొత్తు నేప‌థ్యంలో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా అవ‌కాశాలు రావ‌నే క్లారిటీ త‌ర్వాత సిద్ధూ కాంగ్రెస్ వైపు తిరిగారు. అయితే కాంగ్రెస్ లోకి వ‌చ్చి రాగానే సిద్ధూ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని టార్గెట్ గా పెట్టుకున్నాడు. కానీ.. కాక‌లు తీరిన అమ‌రీంద‌ర్ ఉండ‌టంతో సిద్ధూ ఆట‌లు సాగ‌లేదు.

అక్క‌డ‌కూ సిద్ధూకు కాంగ్రెస్ హై క‌మాండ్ చాలా ప్రాధాన్య‌త‌నే ఇస్తూ వ‌చ్చింది. సిద్ధూపై అమ‌రీంద‌ర్ గ‌రంగ‌రంగా ఉన్నా.. అధిష్టానం స‌ద్దుమ‌ణిగేలా చేసింది ఆ గొడ‌వ‌ల‌నే. ఇలాంటి క్ర‌మంలో.. ఈ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ప‌తాక స్థాయికి చేరింది. అమ‌రీంద‌ర్ కేబినెట్లో సిద్ధూ మంత్రి ప‌ద‌విని వ‌దులుకున్నాడు. అయితే అధిష్టానం మాత్రం సిద్ధూకు ప్రాధాన్య‌త‌ను ఇచ్చింది. అనంత‌ర‌కాలంలో సిద్ధూకు పీసీసీ అధ్యక్ష ప‌ద‌విని ఇచ్చింది. దాన్ని గౌర‌వంగా చూడ‌లేదు సిద్ధూ. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం కోస‌మే ప‌ని చేసిన‌ట్టుగా ఉన్నాడు.

ఇక చివ‌ర‌గా కూడా సిద్ధూకు సానుకూలంగా అమ‌రీంద‌ర్ రాజీనామా జ‌రిగింది. అమ‌రీంద‌ర్ రాజీనామాతో సిద్ధూక‌న్నా ఆనందించిన వాళ్లు లేక‌పోవ‌చ్చు. అయితే.. అక్క‌డ వ‌ర‌కూ సిద్ధూకు హ్యాపీనే అయినా.. త‌న‌కు వెంట‌నే సీఎం సీటు ద‌క్క‌క‌పోవ‌డం, మ‌రో జాట్ సిక్కు ఎమ్మెల్యేకు పంజాబ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం మింగుడు ప‌డ‌లేదు. చ‌న్నీ అభ్య‌ర్థిత్వాన్ని సిద్ధూ బాహాటంగా మ‌ద్ద‌తు ప‌లికాడు. అయితే నెక్ట్స్ ఎన్నిక‌ల త‌ర్వాత అయినా త‌న‌కే అవ‌కాశం అని లెక్క‌లేశాడు ఈ మాజీ క్రికెట‌ర్.

ఇంత‌లో మ‌రో జాట్ సిక్కును తీసుకెళ్లి డిప్యూటీ సీఎంగా చేశారు. దీంతో త‌ను వెనుక‌బ‌డిపోయిన‌ట్టుగా సిద్ధూ లెక్క‌లేసిన‌ట్టుగా ఉన్నాడు. దీంతో పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి దుమారం రేపాడు.

ఇప్పుడు సిద్ధూ కాంగ్రెస్ కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డం సంగతెలా ఉన్నా.. అన్ని పార్టీలూ సిద్ధూను ఇక సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌చ్చు కూడా. ఇప్ప‌టికే బీజేపీ నుంచి ఈయ‌న బ‌య‌ట‌కు వెళ్లిన వ్య‌క్తి. ఇక కాంగ్రెస్ వాళ్లు ఏ మేర‌కు బుజ్జ‌గిస్తారో తెలీదు. శిరోమ‌ణి అకాళీదళ్ ల ఛాన్స్ లేదు. ఇక ఆప్ డైరెక్టుగా సిద్ధూ మీద అటాక్ చేస్తోంది. ద‌ళిత సీఎంను భ‌రించ‌లేకే సిద్ధూ రాజీనామా అంటూ ఆప్ విమ‌ర్శ‌లు చేసింది. త‌న దూకుడైన తీరుతో ఇప్పుడు సిద్ధూ అంద‌రి న‌మ్మ‌కాన్నీ కోల్పోయిన స్థితిలో నిలుస్తున్న‌ట్టుగా ఉన్నాడు.
Tags:    

Similar News