జైల్లో ఆత్మహత్యాయత్నం..జేడీకి అన్ని ట్యాబ్లెట్స్ ఎక్కడివి?

Update: 2019-10-20 05:16 GMT
ఇటీవల పెను సంచలనంగా మారిన ఐఎంఎస్ స్కాంలో అరెస్ట్ అయిన జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ ఉదంతం తెలిసిందే. కోట్లాది రూపాయిలు మందులు.. కిట్ల కొనుగోళ్లలో భారీ అవకతవకలకు ఆమె పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తన ఇంటిపేరు కలకుంట్ల అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పేరైన కల్వకుంట్ల పేరుతో చక్రం తిప్పటమే కాదు.. అధికారుల్ని ఒక రేంజ్లో ఆడుకున్నారని.. సీఎం తమకు బంధువు అవుతారంటూ అధికారాన్ని చెలాయించారన్న విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఆమె లీలలు బయటకు వచ్చి అరెస్ట్ అయిన పద్మ..చంచల్ గూడ జైల్లో ఉంటున్నారు. అయితే.. బీపీ ట్యాబ్లెట్లను పెద్ద ఎత్తున మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ఆమెను తీసుకొచ్చారు. సాధారణంగా ఖైదీలుగా ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే.. వారికి సంబంధించిన మందుల్లో ఒకట్రెండు ట్యాబ్లెట్లు మాత్రమే ఇస్తుంటారు.

అయితే.. ఆత్మహత్యకు పాల్పడేందుకు అవసరమైన ట్యాబ్లెట్లు ఆమెకు ఎలా అందాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. జైల్లో ఖైదీగా ఉన్న వారికి పరిమిత మోతాదులో మాత్రమే ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. అలాంటప్పుడు పద్మకు అన్ని మందులు ఎలా చేరాయన్న అంశంపై అధికారులు ఇప్పుడు విచారిస్తున్నారు.

శనివారం తన కుటుంబ సభ్యుల్ని ములాఖత్ లో కలిసి మాట్లాడిన తర్వాత ఆమె తన బ్యారక్ కు తిరిగి వెళ్లారు. మధ్యాహ్నం వేళలో వేసుకోవాల్సిన బీపీ ట్యాబ్లెట్లను పెద్ద ఎత్తున వేసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల వేళలో జైలు గదిలో ఆమె కుప్పకూలారు. దీంతో.. అక్కడి సిబ్బందికి తోటి ఖైదీలు సమాచారం ఇవ్వటంతో ఆమెను  హుటాహుటిన జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు ప్రధమ చికిత్సలో భాగంగా స్టమక్ వాష్ ను జైల్లోనే నిర్వహించారు. ప్రస్తుతం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చికిత్స చేస్తున్నారు. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు.

Tags:    

Similar News