పవన్ అలా చేస్తే ఆ మాజీ మంత్రి భీమ్లా నాయక్ అని పిలుస్తారట

Update: 2022-04-18 05:23 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లు పాత కేబినెట్ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. పదవులు పోయినోళ్లు కొందరు.. పదవులు వస్తాయని ఆశించి భంగపడిన మరికొందరు లోలోన రగులుతున్నా.. బయటకు మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇందుకు మినహాయింపుగా ఒకరిద్దరు మాజీలు మాత్రం తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. మంత్రులుగా ఉన్న వేళలో తరచూ మీడియాలో దర్శనమిచ్చే ఆ మాజీల్లో అనిల్ కుమార్ ఒకరు.

తనకు ఏ మాత్రం పొసగని కాకాణికి మంత్రి పదవి ఇచ్చి.. తనను మాజీ చేసిన వైనంపై ఉడికిపోతున్న అనిల్ కుమార్.. ఆ విషయాన్ని తన మాటలతో చెప్పేందుకు అస్సలు వెనుకాడటం లేదు. తరచూ ఏదో ఒక ఇష్యూతో.. కాకాణి మీద పరోక్షంగా పంచ్ లు వేస్తున్న ఆయన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి నెల్లూరులో ఒక సభ ఏర్పాటు చేస్తే.. దానికి పోటీ సభను నిర్వహించటం ద్వారా.. తగ్గేదేలె అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

పోటీగా సభను నిర్వహించి.. అధినేతకు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకు ఆయన వేస్తున్న ఎత్తులకు ముగ్దులవ్వాల్సిందే. అధినేత జగన్ కు.. పార్టీకి తానెంత విదేయుడ్ని అన్న విషయాన్ని తెలియజేయటమే కాదు.. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అవుతానన్న ధీమాతో పాటు.. మరోసారి మంత్రిని కానున్నట్లుగా చెబుతున్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఎంతసేపు తాను.. తన పలుకుబడి.. జగన్ మీద ఉన్న అభిమానం లాంటి అంశాలకే పరిమితం కాకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా ఏదో ఒకవిధంగా వ్యాఖ్యలు చేయటం అనిల్ ప్రత్యేకతగా చెప్పాలి. తాజాగా నిర్వహించిన పోటీ సభలోనూ పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కు స్పష్టత లేదన్న ఆయన.. అతను భీమ్లా నాయక్ కాదు.. బిచ్చం నాయక్ అంటూ ఎద్దేవా చేశారు.

అయితే.. వచ్చే ఎన్నికల్లో జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం తాను పవన్ ను భీమ్లానాయక్ అని పిలుస్తానంటూ కొత్త మాటలు చెబుతుననారు. అంటే.. మాజీగా ఉన్న అనిల్ కుమార్ నోటి నుంచి పవన్ ను భీమ్లా నాయక్ అని పిలిపించుకోవాలంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులే పోటీ చేయాలా? అయినా.. పవన్ కల్యాణ్ అని అదిరే పేరు మాత్రమే కాదు.. ఆయన్ను అభిమానించే వారు పవన్ స్టార్ అని పిలుస్తున్నప్పుడు.. భీమ్లా నాయక్ అన్న ట్యాగ్ ఉంటే ఎంత? ఊడితే ఎంత? అయినా.. మంత్రిగా ఉండి మాజీగా మారిన తర్వాత కూడా అనిల్ లాంటి నేతలు చేసే వ్యాఖ్యల్ని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అన్న ప్రశ్నను జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News