ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ.. పార్టీకి పెద్ద చిక్కే వ‌చ్చిందే...!

Update: 2022-12-01 23:30 GMT
వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాలు ఎలా ఉన్నా..వాటిని స‌రిదిద్దు కోవాల‌ని.. పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. అయితే, కీల‌క నాయ‌కులే వివాదాల‌కు దిగుతుండ‌డం ఇప్పుడు పార్టీకి తీవ్ర సంక‌టంగా మారిపోయింది. ఎంపీని ఓడించాల‌ని ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు అస‌లు టికెట్ ఇవ్వొద్ద‌ని ఎంపీ.. ఇలా ఇద్ద‌రూ కూడా ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ.. అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే , మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాల శౌరి ఇద్ద‌రు కూడా.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తులు. అయితే, వీరి మ‌ధ్య 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో బాగానే క‌లివిడి ఉంది. కానీ, తర్వాత మాత్రం వివాదాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఎవ‌రికి వారు కార్య‌క్ర‌మాలు చేసుకుంటున్నారు. మంత్రిగా ఉన్న‌ప్పుడు.. త‌న‌దే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించార‌ని.. ఎంపీ బాల‌శౌరి ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు చేశారు.

ఇక‌, మంత్రిగా దిగిపోయిన త‌ర్వాత ఎంపీ పెత్త‌నం చేస్తున్నార‌ని నాని అంటున్నారు. ఇలా మొద‌లైన వివాదం ఇప్పుడు పోర్టు వ‌ర‌కు పాకింది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ పోర్టు నిర్మాణంపైనే వీరు రాజ‌కీయ హామీ ఇచ్చి ఇద్ద‌రూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితిపోయి.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వ‌చ్చే ఏడాది పోర్టు ప‌నులు చేప‌డ‌తామ‌ని ఎంపీ అంటున్నారు.

దీనికి విరుద్ధంగా నాని మాత్రం ఈ నెల‌లోనే పోర్టు ప‌నుల‌ను  సీఎం జ‌గ‌న్ చేప‌డ‌తార‌ని చెబుతున్నారు. ఫ‌లితంగా ఎవ‌రి మాట న‌మ్మాల‌నేది ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిగా మారింది. మ‌రోవైపునాని కుమారుడు.. ప్ర‌జ‌ల మ‌ధ్య కు వెళ్లి ``మాకే ఓటేయండి`` అని చెప్ప‌డం కూడా ఎంపీని తీవ్రంగా ఆగ్ర‌హానికి గురి చేస్తోంది. త‌న‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నార‌నేది ఆయ‌న బాధ‌.వెర‌సి.. ఇప్పుడు మ‌చిలీప‌ట్నం ప‌రిస్థితి వైసీపీకి కంట్లో న‌లుసుగా మారిపోయింద‌ని అంటున్నారు నాయ‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News