శభాష్: రూ.2 కోట్ల విలువైన ఇంటిని దానమిచ్చిన మాజీ ఎమ్మెల్యే సతీమణి

Update: 2022-04-09 05:31 GMT
ఇన్ కమింగ్ తప్పించి అవుట్ గోయింగ్ అన్నది ఉండదన్నట్లుగా వ్యవహరించే ఈ తరం ప్రజాప్రతినిధులకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు కొందరు నేతలు.. వారి కుటుంబ సభ్యులు. ఇలాంటివారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేంత మాత్రమే ఉన్నారు. రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సాయం చేయటమే తప్పించి.. మరే ఆలోచన లేని నేతలు.. వారి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు బొగ్గారపు రుక్మిణమ్మ.

ఖమ్మం జిల్లాలోని మామిళ్ల గూడెంలో ఉండే ఆమె.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన పుట్టింటి వారు ఇచ్చిన ఇంటిని ఒక సేవా సంస్థ కోసం దానంగా ఇచ్చేశారు. ఈ ఇంటి విలువ రూ.2 కోట్ల వరకు ఉండటం గమనార్హం. అందరిని ఆకర్షిస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పూర్వ ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా వ్యవహరించారు బొగ్గారపు సీతారామయ్య. ఆయన సతీమణే రుక్మిణమ్మ. సీతారామయ్య మరణించిన తర్వాత నుంచి ఆమె మామిళ్లగూడెంలో నివాసం ఉంటున్నారు.

ఇదిలాుంటే.. తాను ఉంటున్న ఇంటిని 'ఇల్లు ఫౌండేషన్' (అన్నం సేవా ఫౌండేషన్) కు వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ఇప్పుడా ఇంటి విలువ రూ.2 కోట్లు. మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నఅనాథలు.. అభాగ్యుయలకు అండగా నిలిస్తున్న ఫౌండేషన్ సేవలకు చలించిపోయిన ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.  

తాజాగా ఇంటి దస్తావేజుల్ని ఫౌండేషన్ ఛైర్మన్ అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు. తన భర్త బతికి ఉన్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించేవారని.. ఆయన పేరు శాశ్వితంగా జిల్లా ప్రజలకు గుర్తుండిపోయేలా ఉండాలనే కోరికతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఫౌండేషన్ కొనసాగినంత కాలం నిత్యం అన్నదానం జరుగుతూనే ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మే 7న సీతారామయ్య వర్థంతి నాడు ఆయన కాంస్య విగ్రహాన్ని దానం ఇచ్చిన ఇంటి ఎదుట ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంత ఆస్తి ఉన్నా తరగని దాహంతో తపించే నేటి నేతలకు భిన్నంగా సాయం చేసే సేవా సంస్థకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో రుక్మిణమ్మ తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News