కందకు లేని దురద చందంగా.. ఉండవల్లిపై ఈ తిట్ల దండకం ఏంది?

Update: 2022-06-14 03:30 GMT
ఒక అంశానికి ఒక వాదనే ఉండదు కదా? ఈ చిన్న విషయాన్ని తెలంగాణలోని పలువురు ఎందుకు గుర్తించరు? రాష్ట్ర విభజనకు సంబంధించి ఎవరి భావోద్వేగాలు వారివి. తెలంగాణను కోరుకున్న వారు మాత్రమే తెలంగాణకు కావాల్సిన వారుగా.. దాన్ని వ్యతిరేకించిన వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించిన వైనాన్ని చూసినప్పుడు ఇవేం మాటలు అనిపించక మానదు. ఏరోజూ కూడా తెలంగాణను సమర్థించిన ఏపీ వారిని ఏపీ ద్రోహులు.. ఏపీ తల్లి రొమ్మును గుద్దినోళ్లు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది లేదు.

ఇక.. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన బిల్లును లోక్ సభలో ఏ రీతిలో పాస్ చేయించారో అందరికి తెలిసిందే. అయితే.. ఆ విషయాన్ని ప్రశ్నించిన వారిపై కత్తి కట్టే తెలంగాణవాదులు.. ఇప్పుడు ఉండవల్లిపై తమకున్న ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని.. నోటి దురదను తీర్చుకుంటున్నారు.

ఏం చేసినా ఎదుటోడిని మాత్రమే తిట్టటం తప్పించి.. తమ వారిని పల్లెత్తు మాట అనని తత్త్వం కొందరు తెలంగాణవాదుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏపీకి చెందిన మాజీ ఎంపీ.. బ్రాహ్మణుడు.. వాక్ శుద్ధి ఉన్న ఉండవల్లిని ప్రగతిభవన్ కు కేసీఆర్ ఆహ్వానించిన వైనంపై తిట్టి పోస్తే గులాబీ బాస్ ను తిట్టిపోయాలి.

అంతేకానీ.. తన మానాన తాను ఉంటే.. తనను లంచ్ కు రమ్మని పిలిస్తే వెళ్లిన ఉండవల్లిని నానా మాటలు అంటూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపు చర్చల్లో తిట్టిపోయటంలో అర్థం లేని పనిగా చెప్పక తప్పదు. ఇదంతా చూసినప్పుడు కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్న సామెత గుర్తుకు రాక మానదు. తెలంగాణ జాతిపితగా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాల్ని సైతం త్రుణప్రాయంగా ఇవ్వటానికి సిద్దమైనట్లు ప్రచారం చేసే కేసీఆర్ పిలిస్తేనే కదా ఉండవల్లి వెళ్లింది?

అలాంటప్పుడు తిడితే కేసీఆర్ ను తిట్టాలి. ఇవాల్టికి రాష్ట్ర విభజన జరిపిన తీరు మీద తనకున్న అభ్యంతరాల్ని అదే పనిగా వినిపించే ఉండవల్లి.. గడిచిన ఎనిమిదేళ్లుగా ఒకే మాట చెబుతున్నారే కానీ పూటకో మాట అన్నట్లుగా కనిపించదు. అలాంటప్పుడు ఉండవల్లి తన స్టాండ్ ను తాను వినిపించటం తప్పేం కాదు కదా? ప్రగతిభవన్ కు ఉండవల్లిని ఆహ్వానించిన వేళ.. ఆయన్ను వేలెత్తి చూపించకూడదు.

ఎందుకంటే.. దీనంతటికి కారణం కేసీఆర్. కానీ.. ఆయన్ను ఏ మాట అనని పలువురు తెలంగాణ వాదులు.. అందుకు భిన్నంగా ఉండవల్లి మీద మాత్రం నోరు పారేసుకోవటం దేనికి నిదర్శనం? తాను నిలబడిన స్టాండ్ మీదనే ఉండవల్లి ఉన్నప్పుడు ఆయన్ను నిందించే కన్నా.. బంగారు తెలంగాణ అని చెప్పి.. ఆ విషయాన్ని వదిలేసి.. కేంద్రం మీద తనకున్నకోపానికి.. మోడీ సర్కారుకు ప్రత్యామ్నాయంగా తయారుకావాలన్న ప్లానింగ్ తో ఉన్న కేసీఆర్ ను.. ముందు తెలంగాణ సంగతి చూశాక.. కేంద్రం సంగతి చూడొచ్చు.. అని క్లాస్ పీకాలి కదా? అది వదిలేసి.. తనను పిలిచినందుకు ప్రగతి భవన్ కు వెళ్లిన ఉండవల్లి మీద ఘాటు విమర్శలు చేయటం సరైనదేనా? అన్నది ప్రశ్న.
Tags:    

Similar News