మాజీ ఎంపీ కోసం.. బీజేపీలో పాట్లు..!

Update: 2022-01-20 03:32 GMT
అదేం చిత్ర‌మో కానీ.. ఏ పార్టీలోనూ లేని విధంగా రాష్ట్ర బీజేపీలో మాత్రం చిత్ర‌మైన సంగ‌తులు వెలుగు చూస్తున్నాయి. సాధార‌ణంగా పార్టీకి దూరంగా ఉన్న‌వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అయినా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అయినా.. పార్టీకి దూరంగా ఉన్న‌వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా హెచ్చ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉన్న‌వారికే టికెట్లు ఇస్తామ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. యాక్టివ్‌గా ఉన్న‌వారిని తాను గుర్తు పెట్టుకుంటాన‌ని కూడా అంటున్నారు.

ఇక‌, వైసీపీలో దాదాపు అంద‌రూ యాక్టివ్‌గానే ఉన్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా.. యాక్టివ్‌గా లేక‌పోతే..వారిని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌ని.. అధిష్టానం ఇప్ప‌టికే సంకేతాలు పంపేసింది. అయితే.. దీనికి భిన్నంగా బీజేపీలో మాత్రం రాజ‌కీయాలు మారుతున్నాయి. ``ఆ మాజీ ఎంపీని రంగంలోకి దింపండి సార్‌. అవ‌స‌ర‌మైతే.. ఆయ‌న ఇంటికి వెళ్లి మాట్లాడండి!`` అంటూ.. కొంద‌రు నాయ‌కులు పార్టీ చీఫ్ సోము వీర్రాజుపై ఒత్తిడి తెస్తున్నారు. నిజ‌మే.. కొంద‌రు మాజీ నేత‌లు.. ప‌ద‌వులు అనుభ‌వించిన త‌ర్వాత‌.. పార్టీకి దూరంగా ఉన్నారు. వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అయితే.. ఒక కీల‌క ఎంపీ చుట్టూ.. ఇప్పుడు బీజేపీ నేత‌లు.. తిరుగుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఆయ‌నే న‌ర‌సాపురం మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు. 2014లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయితే.. అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయ‌న తిరిగి యాక్టివ్ అయితే.. పార్టీకి అన్ని విధాలా ద‌న్నుగా ఉంటుంద‌ని.. నేత‌లు భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం వైసీపీలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ కుటుంబ రాజ‌కీయం ఎలా ఉన్నా.. గోక‌రాజు వంటి కీల‌క నాయ‌కుడు.. తిరిగి యాక్టివ్ కావాల‌ని.. కోరుతున్న వారు పెరుగుతున్నారు. అసలు ఆయ‌న రాజ‌కీయాల‌ను ఎప్పుడో వ‌దిలేశారు. అయితే ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న గోక‌రాజు గ‌తంలో బీజేపీకి ఆయుప‌ట్టుగా ఉన్నారు. భారీ ఎత్తున నిధులు కూడా ఇచ్చారు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా కావ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌ను తిరిగి తీసుకువ‌స్తే.. పార్టీకి అన్ని విధాలా ప్ర‌యోజ‌నంగా ఉంటుంద‌ని నేత‌లుసూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో సోముపై ఒత్తిడికూడా పెరుగుతోంది.

అయితే.. సోము మాత్రం బ‌లవంతంగా ఎంత మంది నేత‌ల‌ను తీసుకువ‌స్తాం. వారికి ఉండాలి.. పార్టీ మ‌న‌కు అవ‌కాశం ఇచ్చింది. ఇప్పుడు పార్టీ క‌ష్టాల్లో ఎదురీదుతోంద‌నే ఉద్దేశంతో వారంత‌ట వారు రావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. కానీ, నేత‌లు మాత్రం సోము చెవిలో నిత్యం ఇదే వినిపిస్తున్నారు. ఇదిలావుంటే.. గోక‌రాజు గంగ‌రాజు అస‌లు.. యాక్టివ్‌గా లేక‌పోవ‌డం.. అటు ఆ సామాజిక వ‌ర్గంలోనూ చ‌ర్చ‌గా మారింది. మరి ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News