అనిల్ అన్నా... టైమ్ బ్యాడ్ అన్నా...

Update: 2022-08-30 03:48 GMT
కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, మనది అని ఈ రోజు ఎగిరిపడితే తరువాత రోజు వేరే వారిది అవుతుంది. అపుడు అసలు పొజిషన్ ఏంటో తెలుస్తుంది. రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇపుడు ఉన్నారు. ఆయన మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. పైగా అది కీలకమైన జలవనరుల శాఖ. నాలుగు పదుల వయసులో మంత్రి చాన్స్ రావడం, కీలకమైన బాధ్యతలు అందుకోవడం, పైగా సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడని ముద్ర పడడంతో అనిల్ కుమార్ యాదవ్ అనే యువ నేతకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని అంటారు.

రాజకీయంగా రాటుదేలిన నెల్లూరు జిల్లాలో అనిల్ హవా అలా మూడేళ్ల పాటు సాగింది. ఆయన ఆడింది ఆటగానే జరిగిపోయింది. కాకలు తిరిగిన బడా నాయకులు  సైతం ఆ ధాటికి  సైలెంట్ గా ఉండిపోయారు. అలా అనిల్ అన్నీ తానే అయి కధ నడిపించారు. అనిల్ కి నోటి దూకుడు కూడా ఎక్కువ. దాంతో సీఎం తరువాత నేనే అనుకున్నారు అని చెబుతారు. నాడు మంత్రి గిరీ చేతిలో ఉంది. దాంతో అనిల్ అన్నా అంటూ అందరూ వెంటబడ్డారు. ఇక మనమే రాజులమని అనుకున్నారు.

ఇలా చూస్తూండగానే క్యాలండర్ ఇయర్ లో మూడేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. జగన్ మాట ఇచ్చిన మేరకు మంత్రులను మార్చేశారు. అలా అనిల్ మాజీ అయ్యారు. వెనక్కి తిరిగి చూస్తే ఆయన పక్కన ఇపుడు ఎవరూ లేరు. ఉన్న చోటన బ్యాడ్ అయ్యారు. పైగా సొంత పార్టీలోనే ప్రత్యర్ధులు తయారయ్యారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, సంగం బ్యారేజీల్లో మిగిలిన పది శాతం పనులను కూడా మంత్రి హోదాలో ఉండి పూర్తి చేయించలేకపోయారు.

అలాగే ఆయన ఇచ్చిన అనేక హామీలు మరుగున పడ్డాయి. ఇక సోమశిల‌ డ్యామ్ కూడా వరదలకు బాగా దెబ్బతింది. దానికి కూడా మరమ్మతులు చేయించలేని పరిస్థితిలో మంత్రిగారు అనాడు ఉన్నారా అంటే ఆయనకే తెలియాలి అని అంటున్నారు. ఇక తానున్న చోట తనకు ఓటేసిన చోట అంటే నెల్లూరు సిటీలో కూడా కాలువకట్టల మీద ఇళ్లు నిర్మించుకున్నవారికి పక్కగా నివాసం ఉండేలా ఇళ్ళ  పట్టాలిస్తామని హామీ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ దాన్ని కూడా చేయలేకపోయారు. ఇస్తామని చెప్పి ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని హ్యాండ్ ఇచ్చేశారని అక్కడి వారు గుస్సా అవుతున్నారు.

దాంతో ఈసారి నెల్లూరు సిటీలో పోటీ చేస్తే ఓటమి తప్పదు అన్న అంచనాకు మాజీ మంత్రి గారు వచ్చేశారు అని అంటున్నారు. ఆయన ఇపుడు వెంకటరిగి నియోజకవర్గం మీద కన్నేసారని టాక్. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ విషయం చాలా కాలం క్రితమే తెలుసు కాబట్టి మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడికి అక్కడ జగన్ సీటుకు హామీ ఇచ్చారని అంటున్నారు.

పైగా అనిల్ కుమార్ వెంకటరిగికి ఎలా వస్తారు ఆయన నాన్ లోకల్ అని అక్కడి వైసీపీ నేతలే అంటున్నారుట. దాంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో అనిల్ కుమార్ యాదవ్ పడ్డారని టాక్. ఇక తనకు ఎంతో దన్నుగా ఉన్న సొంత బాబాయ్ రూప కుమార్ కూడా ఇపుడు ప్రత్యర్ధిగా మారిపోవడంతో ఈ మాజీ మంత్రికి తన వారు ఎవరో అర్ధం కావడంలేదుట. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారా. చేసినా గెలుస్తారా. ఏమో బ్యాడ్ టైమ్ నడుస్తోంది అనిల్ అన్నకి అని సొంత అనుచరులే అనుకుంటున్నారు అంటే చూడాలి మరి మిగిలిన కధ రాజకీయ తెర మీదనే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News