రాందేవ్ బాబాను ఆప్తులు తిట్టారు..వాళ్లు పొగిడారు

Update: 2017-08-06 05:56 GMT

యోగాగురువుగా కొనసాగుతూ పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మికగురువు బాబా రామ్‌దేవ్ ఒకే రోజు భిన్న‌మైన రీతిలో కొంత మోదం...ఇంకొంత ఖేదం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న సన్నిహితుడిగా ఉన్న వారు విమ‌ర్శ‌లు గుప్పించ‌గా...ప‌రిచ‌యం లేని వారు ప్ర‌శంస‌లు గుప్పించారు. రామ్ దేవ్ బాబా జీవితంలోని బయటకు తెలియని ఎన్నో విషయాలను క్రోడీకరించి ప్రియాంక పాఠక్ నారాయణ్ అనే జర్నలిస్టు ``గాడ్‌ మ్యాన్ టు టైకూన్: ది అన్‌ టోల్డ్ స్టోరీ ఆఫ్ బాబా రామ్‌ దేవ్`` పేరుతో పుస్తకం రాశారు. ఇందులోని అనేక అంశాలను ప్రియాంక మీడియాతో పంచుకున్నారు.

``యోగాను బోధించే గురువులే కరువైన సమయంలో బాబా రామ్‌ దేవ్ దానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. వ్యాధులను తక్కువ ధరకే తగ్గించుకునే మార్గాలను చూపించారు. అంతేకాదు అనేక మంది యోగా గురువులను తయారు చేశారు. బాబా రాందేవ్ జీవితాన్ని ప్రభావితంచేసిన వ్యక్తులు నలుగురు. శంకర్‌ దేవ్ నిర్మించి ఇచ్చిన ఆశ్రమంలోనే రామ్‌ దేవ్ యోగా బోధనను ప్రారంభించారు. రెండో వ్యక్తి కరమ్‌ వీర్.. వేలాది మంది ముందు యోగా ఎలా నేర్పాలో రామ్‌ దేవ్‌ కు నేర్పించిన గురువు. మూడోవ్యక్తి రాజీవ్ దీక్షిత్.. ఆర్థిక, రాజకీయ విషయాలను నేర్పించారు. నాలుగోవ్యక్తి ఆచార్య బాలకృష్ణ.. బాబా రాందేవ్‌ కు తన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ కీలకమైన వ్యక్తి. వ్యాపారవేత్తగా ఆయన లక్ష్యం పతంజలి ఉత్పత్తులను సామాన్యులకు చేర్చడమే. అందుకోసం తక్కువ ధరలకే వస్తువులను విక్రయించాలని నిర్ణయించడం వ్యాపారపరంగా అసాధారణ నిర్ణయం. రామ్‌ దేవ్ జీవితాన్ని గమనిస్తే డబ్బు - అధికారం - రాజకీయం - మతం అనేవి భారతదేశంలో ఎలా పనిచేస్తాయనేది తెలుస్తుంది`` అని ప్రియాంక తెలిపారు.

మ‌రోవైపు  2011 నుంచి 2014 మధ్యకాలంలో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ కు సీఈవోగా - పతంజలి ఫుడ్ పార్క్‌ కు ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు నిర్వహించిన సీనియ‌ర్ ఉద్యోగి ఎస్‌ కే పాత్ర.. సంస్థ లోగుట్టును బయటపెట్టారు. ఉద్యోగులను జీతం లేకుండా ఉచితంగా సేవ చేయాలని బాబా రామ్ దేవ్ కోరుకుంటారన్నారు. ``పతంజలి సంస్థ తన ఉద్యోగులకు చాలా తక్కువ జీతం చెల్లిస్తుంది. బాబాజీ ఉద్యోగాన్ని కూడా సేవగానే భావిస్తారు. ఉదాహరణకు.. నేను అక్కడ రెండు బాధ్యతలు చేపట్టా. పతంజలి ఆయుర్వేద - పతంజలి ఫుడ్‌ పార్క్‌ ల కార్యకలాపాలను పర్యవేక్షించా. రెండు ఉద్యోగాలకు వేతనం చెల్లిస్తామని వారు మొదటి హామీ ఇచ్చారు. అయితే, పాత్రాజీ ఇక్కడికి సేవ చేయడానికి వచ్చారు. ఇప్పుడు జీతం కూడా అందుకుంటున్నారు. త్వరలో ఆయన అది కూడా తీసుకోరు``అని బాబాజీ అందరితో అనేవారు.`` అంటూ ఆనాటి సంద‌ర్భాన్ని ఎస్‌ కే పాత్ర మీడియాకు వివ‌రించారు.

ఆ స‌మ‌యంలో తాను వెంటనే స్పందించాన‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ``నాకు జీతం కావాలి అనే వాడిని. నాకోసం కాదు. నాకో కుటుంబం ఉంది. వారి బాగోగులు చూసేందుకైనా డబ్బులు కావాలికదా. దాంతో బాబాజీ నాపై జాలిపడి ఒక ఉద్యోగానికి మాత్రం జీతం చెల్లించేవారు. అయినప్పటికీ ఆయన.. నేను ఉచితంగా సేవ చేయాలని కోరుకునేవారు`` అని ది మింట్ డైలీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాత్ర వెల్లడించారు. ``వాళ్లు చెప్పేదానికి, చేసేదానికి ఎంతో తేడా ఉంటుంది. అది నాకు ఇబ్బంది కలిగించింది. ఫలితంగా నేను సంస్థ నుంచి బయటికొచ్చేశాను`` అని ఆయన చెప్పారు. ఐఐటీ - ఐఐఎం పట్టభద్రుడైన ఎస్‌ కే పాత్ర బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలిని అగ్ర‌గామిగా నిల‌ప‌డంలో కీల‌క పాత్ర పోషించారు.
Tags:    

Similar News