26/11 ముంబై దాడులు పాక్ ప‌నే: న‌వాజ్ ష‌రీఫ్

Update: 2018-05-12 15:37 GMT
2008లో ముంబైపై పాకిస్థాన్ ముష్క‌రులు జ‌రిపిన ఉగ్ర‌దాడిలో వంద‌లాది అమాయ‌కులు అశువులు బాసిన సంగ‌తి తెలిసిందే. దొంగదారిన వ‌చ్చిన దాయాది దేశ‌పు ఉగ్ర‌వాదులు.....166 మంది అమాయ‌కుల‌ను పొట్ట‌నబెట్టుకున్నారు. మ‌రో 308 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ రైల్వే స్టేష‌న్ - తాజ్ హోట‌ల్ - ఒబెరాయ్  ట్రైడెంట్ హోట‌ల్ - నారీమ‌న్ హౌజ్ - లియోపార్డ్ కేఫ్ - కామా హాస్ప‌ట‌ల్ లో చొర‌బ‌డి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపి మార‌ణ హోమం సృష్టించారు. 2008 నవంబ‌రు 26 నుంచి 28(26/11)వర‌కు ఉగ్ర‌వాదుల‌కు భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌కు మ‌ధ్య జ‌రిగిన భీక‌ర‌పోరులో 9మంది ముష్క‌రులు కుక్క‌చావు చ‌చ్చారు. భ‌ద్ర‌తాద‌ళాల‌కు చిక్కిన క‌స‌బ్ ను ఆ త‌ర్వాత ఉరి తీశారు. అయితే, ఆ దాడుల‌కు త‌మ‌కు సంబంధం లేద‌ని, క‌స‌బ్ తో స‌హా 9 మంది ఉగ్ర‌వాదులు పాక్ కు చెందిన వారు కాద‌ని దాయాది దేశం బుకాయిస్తూ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా, 26/11 ముంబై దాడులకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఉగ్ర‌దాడికి పాల్ప‌డింది పాక్ ఉగ్రవాదులేనని స్పష్టం చేస్తూ  ‘డాన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు.

26/11 ముంబై దాడులకు పాకిస్థాన్ ప్రేరేపిత ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాదులే కార‌ణ‌మ‌ని భార‌త్ ఆధారాల‌తో స‌హా ఆరోపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ఆ దాడులతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతూ కాలం వెళ్ల‌దీస్తోంది. అంతేకాకుండా, వారు పాక్ పౌరుల‌ని సరైన ఆధారాలు లేవంటూ తొమ్మిదేళ్లుగా ఈ కేసు విచారణను పాక్ ప్ర‌భుత్వం సాగ‌దీస్తూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ ఉగ్ర‌వాదులు పాక్ కు చెందిన వారేన‌ని నవాజ్ ష‌రీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఆ పేలుళ్లతో తమ పాక్ సర్కారుకి సంబంధం లేదని న‌వాజ్ ష‌రీఫ్ చెప్ప‌డం విశేషం. అయితే, ఆ పేలుళ్ల సూత్రధారి తమ దేశానికి చెందిన వ్యక్తేనని ఆయ‌న అన్నారు. తమ దేశంలో యాక్టివ్ గా ఉన్న‌ ఉగ్ర స్థావరాలు రాజ్యేతర శక్తులని న‌వాజ్  చెప్పారు. న‌వాజ్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో పాక్ స‌ర్కార్ స్పంద‌న ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News