ఏమిటమ్మా.. ఈ దురాశ..?

Update: 2015-07-30 05:15 GMT
దేశంలోనే అత్యున్నత పదవిని ఐదేళ్లు పూర్తి చేసిన ఒక పెద్ద మనిషి రెండంటే.. రెండే సూట్ కేసులతో రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయనే.. భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన తర్వాత రాష్ట్రపతి కుర్చీలో కూర్చున్న ప్రతిభాపాటిల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం.

దేశం మొత్తానికి తన వ్యవహారశైలిలో ఆదర్శంగా ఉండాల్సిన ఆమె.. అందుకు భిన్నంగా.. విమర్శలు వ్యక్తం అయ్యేలా.. వేలు చూపించేలా ఉండటం గమనార్హం. తన విదేశీ పర్యటనలతో దేశ ఖజానాపై భారాన్ని మోపిన ఆమె.. తాను పదవీ విరమణ చేసిన తర్వాత కూడా గొంతెమ్మకోర్కెల్ని కోరటం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందేమో.

రాష్ట్రపతి పదవిని చేపట్టిన వ్యక్తికి.. అతని తుది వరకూ దేశమే వారి బాగోగులు చూసుకుంటుందన్న విషయం తెలిసిన వెంటనే కలాం తన ఆస్తి మొత్తాన్ని ఒక స్వచ్ఛంద సంస్థకు రాసేసి.. సాదాసీదాగా బతికేసిన వైనానికి భిన్నంగా.. ప్రతిభ పాటిల్ కోర్కెలు కోరుతున్నారు. తాజాగా ఆమె ఒకకొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు.

మాజీ రాష్ట్రపతి హోదాలో ప్రభుత్వం కారును ఇస్తుంది. ఒకవేళ సొంత కారు ఉంటే.. దానికయ్యే ఖర్చును భరిస్తుంది. అయితే.. ప్రతిభ తనకు ప్రభుత్వం కేటాయించిన కారు సరిపోవటం లేదని.. మరింత పెద్ద కారు కావాలన్న ప్రతిపాదన ఒకటి.. తనకు సొంత కారు ఉందని.. దానికి.. ఆయిల్ భారంతో పాటు.. మరో వాహనాన్ని కేటాయించాలని కోరుతున్నారు. ఊళ్లో ఉన్నప్పుడు తన కారును.. బయటకు వెళ్లే సమయంలో ప్రభుత్వ కారును ఉపయోగించుకోవాలని ఆమె భావిస్తున్నరు.

ఆమె కోరికను తీర్చాలంటే నిబంధనల్ని మార్చాల్సి ఉంటుంది. తన ప్రతిపాదనల్ని గత మూడు నెలలుగా ప్రభుత్వానికి పంపించటం.. వారు స్పందించకపోవటం జరుగుతోంది. అయినా పట్టువదలని విక్రమార్కుడి తరహాలో ఆమె తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు. అయినా.. ఈ కారు.. ఆయిల్.. ఇలాంటి వాటి కోసం మరీ అంత పాకులాడాలా..?
Tags:    

Similar News