సీనియర్ నేత కల్యాణ్ సింగ్ ఇక లేరు.. ఆయన రేంజ్ ఎంతంటే?

Update: 2021-08-22 04:00 GMT
కల్యాణ్ సింగ్.. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరు కానీ.. కూసింత రాజకీయ అవగాహన ఉన్న వారికి ఆయన పేరు సుపరిచితం. 89 ఏళ్ల ఈ పెద్ద మనిషి ఒకప్పుడు బీజేపీలో తిరుగులేని నేత.ఇప్పటికి కమలం పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఆయన ప్రభ తరిగిపోయి చాలా కాలమే అయ్యింది. తాజాగా ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన్ను వెంటిలేటర్ల మీద ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

అరవై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన సొంతం. బీజేపీ మూల సిద్ధాంతాన్ని.. హిందుత్వ వాదనను బలంగా వినిపించే ఆయన.. చేపట్టని కీలక పదవులు అంటూ లేవు. యూపీ ముఖ్యమంత్రి రెండు సందర్భాల్లో పది సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా రెండుసార్లు.. రెండు రాష్ట్రాలకు గవర్నర్లుగా ఆయన సేవలు అందించారు.

కమలం పార్టీకి వీర విధేయుడైన నాయకుడిగా పేరున్న ఆయన.. ఒకదశలో బీజేపీ మీద తిరుగుబాటు చేసి.. సొంత కుంపటి పెట్టుకున్న ఆయన తర్వాతి కాలంలో మళ్లీ బీజేపీ తీర్థం తీసేసుకున్నారు. ఆయనకు కొడుకు రాజ్ వీర్ సింగ్.. కుమార్తె ప్రభావర్మలు ఉన్నారు. ప్రస్తుతం కల్యాణ్ సింగ్ కుమారుడు రాజ్ వీర్ సింగ్ ఎంపీగా యూపీలోని ఏత్ నియోజక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంలో తన సత్తా చాటిన ఆయన.. చిన్నస్థాయి నుంచి అంచలంచెలుగా పెరిగి పెద్ద పెద్ద స్థానాల్ని సొంతం చేసుకున్నారు. సంఘ్ ప్రచారక్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి.. తర్వాతి కాలంలోజన్ సంఘ్ లో చేరటం ద్వారా పొలిటికల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

-  1967లో తొలిసారి అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్ సంఘ్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి అలా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన ఆయన.. అప్పటి నుంచి వరుస విజయాల్ని నమోదు చేశారు. అలా సాగుతున్న ఆయన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమి ఎదురైంది.

-  1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మళ్లీ 1985లో తాను ఓడిన నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో ఏకంగా పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. బీజేపీ మీద గుర్రుతో 2002లో ఆయన సొంతంగా రాష్ట్రీయ క్రాంతి పార్టీని పెట్టారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి కూడా గెలుపొందారు.

-  1977 -79లో యూపీ ఆరోగ్య మంత్రిగా వ్యవహరించిన ఆయన  తర్వా తికాలంలో రెండు దఫాలుగా సీఎంగా కూడా పని చేశారు. 1991 జూన్ లో యూపీ అసెంబ్లీలో బీజేపీ విజయం సాధించటంతో తొలిసారి ఆయన సీఎం అయ్యారు. అయోధ్యను సందర్శించి రామ మందిర నిర్మాణాన్ని చేపడతానని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అయోధ్యలోని వివాదాస్పద కట్టటం కూలిపోయింది. ఇదంతా ఆయన వైఫల్యమేనని.. కుట్ర చేసి మరీ కూల్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

-  పేరుకు బీజేపీ నేత అయినప్పటికీ.. పార్టీ అధినాయకత్వంతో తేడా వచ్చిన ప్రతిసారీ తిరుగుబాటుజెండాను ఎగరేయటం ఆయనకు అలవాటు. ఒకసారి సొంతంగా పార్టీ పెట్టటానికి వెనుకాడ లేదు. 1999లో సొంత కుంపటైన రాష్ట్రీయ క్రాంతి పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీలోకి విలీనం చేశారు. 2009లో బీజేపీని వదిలేసిన ఆయన.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి సత్తా చాటారు. అక్కడికే ఆగితే ఆయన కల్యాణ్  సింగ్ ఎందుకు అవుతారు చెప్పండి.

-  తన కుమారుడితో కలిసి కల్యాణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ తీర్థం తీసుకున్నారు. అయితే.. ఆయన కారణంగా సమాజ్ వాదీకి లాభం చేకూరలేదు. దీంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి. 2010లో జన్ క్రాంతి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. 2013లో మళ్లీ ఆ పార్టీని రద్దు చేసి.. మరోసారి బీజేపీలో చేరారు.  2014లో రాజస్థాన్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. తర్వాతి కాలంలో హిమాచల్ ప్రదేశ్ అదనపు గవర్నర్ గా కూడా బాద్యతలు చేపట్టారు.
Tags:    

Similar News