ముద్రతో చిక్కిన పాజిటివ్ యువకుడు

Update: 2020-03-24 18:30 GMT
ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో కళ్లారా చూస్తున్నా... చెవులారా వింటున్నా ప్రజలు వినడం లేదు. సాధారణ ప్రజల సంగతి పక్కన పెడితే విదేశాల నుంచి వచ్చి... క్వారంటైన్ లో ఉండమని పోలీసులు చెప్పిన వాళ్లు కూడా క్వారంటైన్ లో లేకుండా లాక్ డౌన్ లో బయట తిరుగుతూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతున్నారు. సాధారణ ప్రజలు బయట తిరిగినా తీవ్రంగా పరిగణించండి అని ఆదేశాలున్న నేపథ్యంలో క్వారంటైన్ లో ఉంటూ ఓ వ్యక్తి మాదాపూర్ ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు.

మార్చి 19 ఆస్ట్రేలియా నుంచి హైదరాబాదు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దారుణమైన విషయం ఏంటంటే... తల్లిదండ్రులు అతనికి సహకరించారు. అతనితో పాటు బయటకు వచ్చారు. ఇలాంటి వారు ఒకరు బయట తిరిగితే అది వేలమందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. అతను తనకు వైరస్ లేదు అనుకుని బయట తిరుగుతుంటే... గాంధీ లో పరీక్షలు చేయగా... పాజిటివ్ వచ్చింది. తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించి వారిని హోం క్వారంటైన్ లో ఉంచారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా ఉండటం దీనికి కారణం. ప్రజలను ఎంత హెచ్చరించినా... ఇంటి పట్టున ఉండటం లేదని ఈరోజు నుంచి కారణం లేకుండా కనిపిస్తే లాఠీలతో వీపు పగలగొట్టడం ప్రారంభించారు. అయితే పౌరుల్లో తగిన భయం కనిపించడం లేదు.




Tags:    

Similar News