ఇంత జరిగినా బ్రేకింగ్ న్యూస్ పడలేదు!

Update: 2022-04-22 05:58 GMT
చీమ చిటుక్కుంటే చాలు బ్రేకింగ్ న్యూస్ పడే రోజులివి. టీవీ తెర మీద బ్రేకింగ్ న్యూస్ తో పాటు భయంకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొంపలు మునిగిపోతున్న హడావుడి చేస్తుండటం.. అందరికి అనుభవమే. అలాంటిది.. ఫ్లైఓవర్ నిర్మిస్తున్న వేళ నాలుగు గడ్డర్లు కుప్పకూలిపోయిన ఉదంతం చోటు చేసుకుంటే హడావుడి ఎంతుంటుంది? అది కూడా ఏపీలో అయితే? రోటీన్ కు భిన్నమైన అనుభవాన్ని మిగిల్చింది తాజా ఉదంతం.

పామర్రు - దిగమర్రు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆలపాడు పంచాయితీ పరిధిలో రూ.66 కోట్ల వ్యయంతో 1.6 కిలోమీటర్ల మేర ప్లైఓవర్ నిర్మాణాన్ని చేస్తుననారు. బుధవారం పిల్లర్ల పై నాలుగు నిలువు వరుసల్లో సిమెంటు గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఓకే బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ నాలుగు గడ్డర్లు కుప్పకూలిపోయాయి. అయితే.. ఆ సమయంలో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

గురువారం మధ్యాహ్నం వరకు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా కాంట్రాక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు. కుప్పకూలిపోయిన గడ్డర్ల చుట్టూ పెద్ద ఎత్తున పరదాలు కట్టేసి.. పని చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వటం.. ఈ ఉదంతం నేషనల్ హైవే మీద ఉండటంతో విషయ తీవ్రత బయటకు రాలేదు.

సాధారణంగా ఫ్లైఓవర్లు నిర్మాణం వేళ.. బోలెడన్ని జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు నాణ్యత విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా చోటు చేసుకునే నష్టం భారీగా ఉండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటారు.

సాధారణంగా ఇలాంటివి ఏమైనా జరిగిన వెంటనే.. కాంట్రాక్టర్ బాధ్యుడైనా ప్రభుత్వాన్ని బద్నాం చేయటం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుడి ఎక్కువగా ఉండటం ఏమో కానీ.. మీడియాలోనూ పెద్దగా ఫోకస్ కాలేదు.

టీవీల్లోనూ పెద్దగా చర్చ జరిగింది లేదు. ఫ్లైఓవర్ కు చెందిన నాలుగు గడ్డర్లు కూలిపోయి కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఉండటం సీఎం జగన్ లక్ గా మాత్రం చెప్పక తప్పదు. ఇక.. సిమెంట్ గడ్డర్లు ఇలా కూలిపోవటం వెనుక అసలు కారణం ఏమిటి? నాణ్యత లోపం అంశం మీదా గుట్టుగా విచారణ సాగుతోంది. ఇంత జరిగిన తర్వాత కూడా మీడియాలో ఈ అంశం మీద ఎలాంటి హడావుడి జరగకపోవటం గమనార్హం.
Tags:    

Similar News