ఇక.. కంప్యూటర్లు మేడిన్ ఆంధ్రా

Update: 2015-12-10 05:44 GMT
విభజన నేపథ్యంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీ.. ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది. ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ లో పలు మొబైల్ కంపెనీలు ఉత్పత్తి షురూ చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా కంప్యూటర్ల తయారీని స్టార్ట్ చేయటం సానుకూలాంశంగా చెప్పొచ్చు.

ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఉంటే.. హార్డ్ వేర్ గా ఏపీని మారుస్తానని ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనికి తగ్గట్లే సాగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వటం పట్ల ఏపీ సర్కారు సంతృప్తి వ్యక్తం చేస్తోంది. మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఇప్పకేటి పలు సంస్థలు ఏపీలోని శ్రీసిటీకి తరలి రాగా.. తాజాగా ప్రఖ్యాత ఫాక్స్ కాన్ కంపెనీ డెస్క్ టాప్.. ట్యాప్ టాప్ లు.. ట్యాబ్లెట్లు.. కంప్యూటర్లతో పాటు.. వాటి విడిభాగాల తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రితో సమావేశమైన సంస్థ ప్రతినిధులు.. భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతామంటూ హామీ ఇచ్చారు. వారికి అవసరమైన సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్దిరోజుల్లో మేడిన్ ఏపీ కంప్యూటర్లు మార్కెట్లు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇక.. తాజాగా ఏపీ సర్కారును కలిసిన ఫాక్స్ కాన్ సంస్థ గురించి చెప్పాలంటే.. ఈ సంస్థ.. ఆపిల్.. డెల్.. హెచ్ పీ.. అసెర్.. హువాయ్.. సోనీ.. తోషిబా.. జియోమి.. మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలకు ఫాక్స్ కాన్ కంప్యూటర్లను తయారు చేసి ఇస్తోంది. ఇంత పెద్ద సంస్థ ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో.. హార్డ్ వేర్ పరంగా ఏపీ మరో అడుగు ముందుకు వేసినట్లుగా చెప్పొచ్చు.
Tags:    

Similar News