జైషేకు ఫ్రాన్స్ షాక్‌!... మ‌సూద్ ఆస్తుల జ‌ప్తు!

Update: 2019-03-15 16:47 GMT
భార‌త్ లో అల్ల‌క‌ల్లోల‌మే ల‌క్ష్యంగా పురుడుపోసుకున్న ఉగ్ర‌వాద సంస్థ జైషే మొహ్మ‌ద్ ను ర‌క్షించుకునేందుకు పాకిస్థాన్ తో పాటు ఆ దేశానికి స్నేహ హ‌స్తం అందిస్తున్న చైనాలు ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నా.... అంత‌ర్జాతీయ స‌మాజం మాత్రం త‌న‌దైన శైలి షాకిలిస్తూ వ‌స్తోంది. జైషేకు పూర్తి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న పాక్ ను ఇప్ప‌టికే ప‌లుమార్లు నిల‌దీసిన అగ్ర‌రాజ్యం అమెరికా... ఆ సంస్థ చీఫ్ మౌలానా మ‌సూద్ అజర్ పై ఆంక్ష‌లు విధించాల్సిందేన‌ని ఖ‌రాకండీగా చెప్పింది. మ‌సూద్‌పై చ‌ర్య‌లు లేకుంటే త‌మ నుంచి అందుతున్న సాయాన్ని కూడా నిలిపివేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ హెచ్చ‌రిక‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లుగా బాగానే న‌టిస్తున్న పాకిస్థాన్‌... అమెరికా అంటే అంతెత్తున ఎగిరిప‌డుతున్న త‌న మిత్ర దేశం చైనాను పావుగా వాడుకుంటూ మ‌సూద్‌ పై చ‌ర్య‌ల‌ను వాయిదా వేస్తూ వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో ఇటు పాక్‌ - అటు చైనా ప్ర‌మేయం ఏమాత్రం లేకుండానే మ‌సూద్ తో పాటు జైషేకు భారీ దెబ్బ ప‌డిపోయింది. ఇటీవ‌లి పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో జైషే ఉగ్ర కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్నేసిన ఫ్రాన్స్‌... ఆ సంస్థ కోర‌లు పీకేందుకు సైలెంట్ గానే ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేస్తోంద‌ని చెప్పాలి. పుల్వామా దాడి త‌ర్వాత జైషేతో పాటు ఆ సంస్థ చీఫ్ మసూద్ కార్య‌క‌లాపాలు - ఆ సంస్థ నెట్ వ‌ర్క్‌ - మ‌సూద్ వ్య‌వ‌హారాల‌పై నిఘా పెట్టిన ఫ్రాన్స్‌... త‌న భూభాగంలో మ‌సూద్ కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించింది. మసూద్ తో పాటు జైషేను కూడా అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేయాలంటూ భార‌త్ చేస్తున్న పోరాటానికి భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్య‌దేశంగా ఉన్న ఫ్రాన్స్ తో పాటు ఇత‌ర దేశాల‌న్నీ అనుకూలంగా ఉన్నా... ఒక్క చైనా మాత్రం అడ్డుగా నిలుస్తోంది.

ఈ క్ర‌మంలో భార‌త్ చేస్తున్న వాద‌న‌ను పుల్వామా దాడి త‌ర్వాత మ‌రింత లోతుగా ప‌రిశీలించిన ఫ్రాన్స్ త‌న చేతిలోని అస్త్రాన్ని ప్ర‌యోగించింది. త‌న భూభాగం ప‌రిధిలోని మ‌సూద్ ఆస్తుల‌న్నింటినీ సింగిల్ ఉత్త‌ర్వుతో జ‌ప్తు చేసి పారేసింది. ఈ మేర‌కు ఫ్రాన్స్ అంతర్గత భద్రత మంత్రిత్వ శాఖ - విదేశాంగ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. చైనా కార‌ణంగా మ‌సూద్‌ - జైషేల‌పై అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదుల ముద్ర వేసేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో కుద‌ర‌కున్నా... తాను కీల‌కంగా ఉన్న యూరోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ)లో మాత్రం జైషేతో పాటు దాని చీఫ్ మ‌సూద్ పైనా అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది ముద్ర వేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇదే జ‌రిగితే... ఇక భ‌ద్ర‌తా మండ‌లిలోనూ మ‌సూద్‌ - జైషేల‌ను కాపాడ‌టం చైనాకు కూడా సాధ్య‌ప‌డ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News