రూ.10వేలు టు లక్ష.. గూడ్ల గూబల వేట

Update: 2020-12-24 15:19 GMT
గుడ్ల గూబ.. మన సమాజంలో ఇది అపశకునానికి చిహ్నం. ఇది కనిపిస్తే అందరూ పనులు వాయిదా వేసుకుంటారు. ఇంట్లోకి వెళ్లిపోతారు. రాత్రుళ్లు మాత్రమే తిరిగే ఈ పక్షిని కూడా కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. చూడడానికి భీకరంగా భయం గొలిపేలా ఉండే గుడ్ల గూబ క్రేజ్ ఇప్పుడు బిజినెస్ ప్రాడక్ట్ అయ్యింది.

మార్కెట్లో దీనికి యమ డిమాండ్ నెలకొంది. ఒక్కో గుడ్ల గూబ రూ.10వేల నుంచి లక్ష రూపాయల ధర పలుకుతోంది. ఇదే వేటగాళ్లకు వరంగా మారింది.

గుడ్ల గూబ చూస్తే శుభ సూచికమని.. సర్వరోగ నివారిణి అని.. దగ్గర ఉంటే ఆరోగ్యవంతులు అవుతారని.. ఈ పక్షిని ఉదయం లేవగానే చూస్తే శుభం అంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇమ్రాన్ నమ్మించాడు. అమాయకులకు వివిధ రకాల గుడ్ల గూబలను పట్టుకొని వచ్చి లక్షల రూపాయలకు అమ్మేశాడు. కొందరైతే గల్ఫ్ దేశాలకు ఈ పక్షిని కొని తీసుకెళ్లినట్లు తెలిసింది. కొంతకాలంగా గుడ్లగూబల్ని పట్టుకోవడం రూ. 10 వేలు మొదలుకొని రూ. లక్ష వరకూ వాటికి ధర కట్టి హుస్సేని ఆలం, ముర్గీచౌక్‌ ప్రాంతాల్లో అమ్ముతున్నాడు.

అయితే దేశంలో గుడ్లగూబల్ని పట్టుకోవడం, విక్రయించడం నేరం. దీంతో సమాచారం అందుకొని అలీని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వినియోగంలో లేని నీటి ట్యాంకుల్లో గుడ్లగూబలు ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయని తనకు తెలిసిందని, శ్రీశైలం అడవుల పరిసర గ్రామాల్లోని నీటి ట్యాంకుల్లో వాటిని పట్టుకుంటున్నానని అలీ అధికారులకు తెలిపాడు.

అలీ వద్ద మొత్తం 15 గుడ్లగూబల్ని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పగించామని అధికారులు తెలిపారు. వేటగాళ్లు చెప్పే విషయాలు నమ్మి జనం మోసపోవద్దని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సూచించారు.
Tags:    

Similar News