ఫ్రీడమ్ 251ను ఎంతగా ఏసుకున్నారంటే..

Update: 2016-02-24 04:43 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో పాటు.. మొబైల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రింగింగ్ బెల్స్ కంపెనీకి చెందిన ఫ్రీడమ్ 251 ఫోన్ గురించి తెలిసిందే. బహిరంగ మార్కెట్లో రూ.4వేలకు తక్కువ లేకుండా విలువ ఉన్న ఫోన్ ఫీచర్లను కేవలం రూ.251లకే అందిస్తామని రింగింగ్ బెల్స్ అనే కంపెనీ చెప్పటం.. దేశ వ్యాప్తంగా ఇదో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఈ కంపెనీ మీద చాలానే విమర్శలు వచ్చాయి.

ఈ విమర్శలన్నీ ఒక ఎత్తు అయితే.. ఫ్రీడమ్ 251ను ఎద్దేవా చేస్తూ తాజాగా ఒక పేరడీ వెబ్ సైట్ షురూ చేశారు. ధీని లక్ష్యం.. ఫ్రీడమ్ 251ను టార్గెట్ చేయటమే. నిజానికి ఇలాంటి పేరడీలు కొత్తేం కాకున్నా.. వ్యంగ్యంగా ఏసుకునేందుకు ప్రదర్శించిన సృజనాత్మకత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ కంపెనీ గొప్పలు దగ్గర నుంచి.. తాము తయారు చేసే ఫోన్లకు సంబంధించిన సమాచారం గమ్మత్తుగా ఉండటంతో పాటు.. ఫ్రీడమ్ 251 ఎంతలా మోసం చేస్తుందన్న రీతిలో ఈ పేరడీ వెబ్ సైట్ ఉండటం గమనార్హం.

‘‘డజ్ నాట్ రింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’’ అంటూ చెప్పుకున్న ఈ కంపెనీ తమ ఫోన్ ఆంగారక గ్రహంపైన దొరికే ముడిసరుకుతో తయారవుతుందని.. అందుకే తాము ఫోన్ ని రూ.651కే ఇస్తున్నట్లు పేర్కొంది. 2025 నాటికి అంగారక గ్రహం మీదకు మనుషులు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి మెటీరియల్ తెప్పించి.. 2026 జూన్ 30 నాటికి ఫోన్లు డెలివరీ చేస్తామన పేర్కొంది. అంగారకుడిపై వెళ్లటానికి తమిళనాడులోని శివకాశిలోని స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ క్రాకరీస్ తో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని.. 2 కోట్ల రాకెట్లు కొని వాటి ద్వారా మనుషుల్ని అంగారకుడి మీదకు పంపనున్నట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. తమ కస్టమర్ కేర్ నెంబరును ప్రకటించిన ఈ డమ్మీ సైట్ 0420-420420ను సంప్రదించాలని పేర్కొంది. పేరుకు స్కూప్ అయినా రూ.251 ఫోన్ ని ఎటకారం చేసిన తీరు పలువురిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News