ఫ్రీడమ్ 251.. మరో విచిత్రం

Update: 2016-02-19 10:36 GMT
ఆన్ లైన్ షాపింగ్ లోనే విచిత్రం జరిగింది... ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్ లో ఇంతవరకు లేనిది సాధ్యమైంది.. ఇప్పటికే సంచలనాలకు, సందేహాలకు కారణమైన ఫ్రీడమ్ 251 ఫోన్ ను అందిస్తున్న సంస్థ రింగింగ్ బెల్స్ మరో విచిత్రానికి తెర తీసింది. ఆన్ లైన్ లో ఏ వస్తువు కొనాలన్నా పేర్కొన్న పరిమాణం ఒక యూనిట్ గా ఒక వస్తువును ఒకటిగా లేదా అంతకంటే ఎక్కువగా మాత్రమే కొనగలం. పప్పులు ఉప్పులు వంటి గ్రోసరీలు  కూడా వెబ్ సైట్లో అరకేజీ అయితే అర కేజీ, 100 గ్రాములైతే 100 గ్రాములు ఒక యూనిట్ గా లేదా అంతకంటే ఎక్కువగా యూనిట్లలో కొనగలం. ఇక దుస్తులు - షూస్ - ఫోన్లు - టీవీలు - ఫ్రిజ్ లు - ఫోన్ లు వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మాత్రమే కొనగలం. ఆలీబాబా.కామ్ వంటి సైట్ లో హోల్ సేల్ గా పెద్ద మొత్తంలో కొనగలం. కానీ... ఫ్రీడమ్251 ఫోన్ మాత్రం సగం కూడా కొనొచ్చట. ఆ వెబ్ సైట్లో అలాంటి లోపం ఒకటి తాజాగా గుర్తించారు. దీంతో ఆ ఫోన్ పై ఉన్న అనుమానాలు మరింత బలపడిపోయాయి.

 ఏ ఈ-కామర్స్ వెబ్ సైట్ లో అయినా క్వాంటిటీ 1 నుంచే మొదలవుతుంది. కానీ, ఫ్రీడమ్251.కామ్ లో మాత్రం సగం ఫోన్ కూడా ఆర్డర్ చేసినా తీసుకుంటోంది. ఈ లోపం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి వెబ్ సైట్ రూపకల్పన చేసేటప్పుడే.. దానికి సంబంధించిన ఆల్గరిథమ్ సరిగ్గా రూపొందించుకోవాలి. 'ఫ్రీడమ్ 251'లో మాత్రం అలా కాకుండా సగం కూడా బుక్ అవుతోంది.

ఈ విచిత్రం ఇలా ఉండగా... ఇప్పటికే క్రాష్ అయిన ఆ వెబ్ సైట్ రెండో రోజు గురువారం కూడా ఔత్సాహిక వినియోగదారులను నిరాశపరిచింది. తొలిరోజు గురువారం నాడు సెకనుకు 6 లక్షల మంది తమ సైట్‌ ను సందర్శించారని, అంత భారాన్ని సెర్వర్లు తట్టుకోలేకపోవడం వల్లే అది పనిచేయకుండా పోయిందని రింగింగ్‌ బెల్స్ సంస్థ ప్రకటించింది. రెండో రోజూ అదే పరిస్థితి ఏర్పడింది. ఉదయం కొద్దిసేపు పనిచేసిన సైట్ మధ్యాహ్నం నుంచి మొరాయించింది. అసలు ఎలాంటి ఎర్రర్ మెసేజి గానీ ఏమీ లేకుండా సైట్ మొత్తం తెల్ల కాగితంలా మారిపోయింది. దీంతో ఫ్రీడమ్ 251పై అంతోఇంతో ఆశలు ఉన్నవారు కూడా ఇదేదో బోగస్ లా ఉందంటూ ఉసూరుమంటున్నారు.
Tags:    

Similar News