జగన్ కు ‘‘శుక్రవారం’’ రిలీఫ్

Update: 2016-04-01 07:32 GMT
రాజకీయ నేతలకు కేసులు మామూలే.కానీ.. అధినేత స్థాయి వ్యక్తి కేసుల్లో కూరుకుపోవటం ఇబ్బందే. కేసుల కారణంగా భవిష్యత్తులో కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న విషయాన్ని పక్కన పెడితే.. అంతకు రెట్టింపు ఇబ్బందుల్ని వర్తమానంలోనే పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా అక్రమాస్తుల్ని కూడబెట్టారన్న ఆరోపణలపై జగన్ పై ఇప్పటికి 12 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల కారణంగా.. తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవటం ఆయనకు అలవాటుగా మారింది.

కేసుల లొల్లి ఎలా ఉన్నా.. తనపై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు.. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే మీరు.. మమ్మల్ని విమర్శలు చేసే వారా? అంటే ఏపీ అధికారపక్ష నేతలు విరుచుకుపడే దానికి జగన్ అండ్ కో నుంచి సరైన మాట రాలేని పరిస్థితి. అయితే.. ఇకపై ఏపీ అధికారపక్షం అలాంటి మాట అనలేని పరిస్థితి. ఎందుకంటే.. ఇకపై ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సిన అవసరం జగన్ కు ఉండదు.

తనపై ఉన్న కేసుల విచారణలో భాగంగా ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళుతుంటారు. అయితే.. తాను ఒక పార్టీ అధినేతగా వ్యవహరించటంతో పాటు.. ఏపీ విపక్షనేతగా పలు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో ప్రతి వారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావటం ఇబ్బందిగా ఉందంటూ జగన్ పెట్టుకున్న దరఖాస్తు మీద విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఇకపై ప్రతి శుక్రవారం జగన్ తన కేసుల విచారణకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. తెలుగు తమ్ముళ్లు జగన్ పై ఎప్పటి మాదిరి ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ఛాన్స్ లేనట్లే.
Tags:    

Similar News