జయతో ఆయన సమావేశం వివాదమౌతోంది..!

Update: 2015-01-20 05:27 GMT
     కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమావేశంపై ఇప్పుడు ఆసక్తికరమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం రోజున పొయస్‌ గార్డెన్‌కు వెళ్లి జయలలితతో సమావేశం అయ్యాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ. మరి జయలలిత ఇప్పటికే అక్రమాస్తుల కేసులో శిక్షను ఎదుర్కొంటూ, బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి. ఈ స్థితిలో కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న శక్తి.

    ఇలాంటి నేపథ్యంలో జైట్లీ వెళ్లి జయతో సమావేశం కావడంపై తమిళనాడు లోకల్‌ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడుతున్నాయి. అవినీతి పరురాలిగా ధ్రువీకరణ అయిన వ్యక్తితో కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి ఏం పని? వీరిద్దరూ ఏయే అంశాల గురించి చర్చించారు? అంటు అక్కడి ప్రతిపక్ష పార్టీలు యాగీ చేస్తున్నాయి.

    ప్రస్తుతం జయలలిత కు సంబంధించి మరి కొన్ని కేసులపై విచారణ కొనసాగుతోంది. ఈ విధంగా చూస్తే జయలలిత ఒక విచారణలో ఉన్న ఖైదీ లాంటిదే. మరి ఆమెతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏం పని వారు ప్రశ్నిస్తున్నారు.

    మరి ఇంతకీ జైట్లీ సారు జయమేడమ్‌ను ఎందుకు కలిశారు? అని భారతీయ జనతా పార్టీ నేతల వద్ద వివరణ కోరితే... రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అన్నాడీఎంకే సహకారాన్ని కోరడానికే అరుణ్‌జైట్లీ జయలలితో సమావేశం అయ్యారని వారు వివరించారు.

    వివిధ బిల్లుల విషయంలో బీజేపీకి రాజ్యసభ పెద్ద అడ్డంకి అవుతోంది. పెద్దల సభలో పూర్తిస్థాయిలో బలం లేకపోవడంతో మోడీ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో ఆ సభలో ఉనికిలో ఉన్న అన్నాడీఎంకే సహకారాన్ని కమలం పార్టీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అదునుగా జయ అవినీతిలో బీజేపీకి వాటా ఉందంటూ తమిళనాడు ప్రతిపక్షాలు విమరిస్తున్నాయి.
Tags:    

Similar News