టీఆర్ ఎస్‌ కు గుడ్‌ బై...కేసీఆర్‌ పై వివేక్ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు

Update: 2019-03-25 10:50 GMT
టీఆర్ ఎస్ పార్టీకి ముఖ్య‌నేత గుడ్‌ బై చెప్పారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీ - రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు వివేక్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. పెద్ద‌ప‌ల్లి ఎంపీ సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో అసంతృప్తిలో ఉన్న ఆయ‌న తాజాగా ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకొని బ‌హిరంగ లేఖ‌ రాశారు. టికెట్ హామీ ఇచ్చి కూడా తనను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే  కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారని లేఖ‌లో మాజీ ఎంపీ వివేక్‌ ఆరోపించారు.  ప్లాన్‌ ప్రకారమే తాను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్‌ చివరి క్షణంలో టికెట్‌ నిరాకరించారని వాపోయారు.

పోటీ చేసేందుకు చాలా ప్రయత్నించడం జరిగిందని - సమయం తక్కువగా ఉన్నందున కొత్త గుర్తు ప్రజలకు చేరదనే బ‌రిలో దిగ‌లేద‌ని వివేక్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దనే కుట్రతోనే ఆలస్యంగా ప్రకటించారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన తండ్రి వెంకటస్వామి విగ్రహాం ట్యాంక్‌ బండ్‌ పై ఏర్పాటుచేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఆ మాటను విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఆటబొమ్మలు కొందరు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే ఎవరు ద్రోహం చేశారో తెలిపోయిందన్న వివేక్‌.. తన తండ్రి కాకా - తాను తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ మేలు కోసమే కేసీఆర్ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చానని.. తెలంగాణ కోసం పనిచేయడం - ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడడమే పార్టీకి ద్రోహం చేయడమా? అని ప్రశ్నించారు.

త‌మ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఆవిర్భవిందా ? లేదా కేసీఆర్ అండ్ టీం వల్ల ఏర్పడిందా అని వివేక్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే తనకు టికెట్ రాలేదని మరోసారి వివేక్ వ్యాఖ్యానించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయడానికి పనిచేయడమే తన తప్పా అని ప్రశ్నించిన వివేక్‌.. 2014లో టీఆర్ ఎస్‌ లో ఇద్దరు ఎంపీలే ఉంటే తాను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తేవడమే ద్రోహమా? అని అన్నారు.  ప్రభుత్వ సలహాదారుడిగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారాయన. ఉద్యమంలో ఏ పాత్ర లేనివాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం చేయనివాళ్లకు టికెట్లిచ్చారని అన్నారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉండడం బాధిస్తోందన్నారు వివేక్‌. ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు త్వరలోనే గుర్తిస్తారని అన్నారు.


Tags:    

Similar News