కాంగ్రెస్‌ లోకి గ‌ద్ద‌ర్‌... ఎంట్రీలోనే సంచ‌ల‌న కామెంట్లు చేసిన ప్ర‌జా యుద్ధ‌నౌక‌

Update: 2022-05-07 11:18 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో త‌మ స‌త్తా చాటేందుకు వ‌చ్చిన కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న ఆ పార్టీ నేత‌ల్లో జోష్ నింపుతోంది. వ‌రుస‌గా రెండో రోజు కూడా రాహుల్ టూర్లో కీల‌క ప‌రిణామాలు తెర‌మీదకు వ‌స్తున్నాయి.

వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన... తాజ్ కృష్ణ లో బస చేశారు. అనంత‌రం తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ క‌లిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు గ‌ద్ద‌ర్ ఆస‌క్తి చూపిన‌ట్లు స‌మాచారం.

రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, మీడియా అధిపతులతో భేటీ అయ్యేందుకు రాహుల్ గాంధీ ఆస‌క్తి చూపించారు. హోటల్ తాజ్‌కృష్ణలో జ‌రిగిన ఈ సమావేశంలో భాగంగా, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌ద్ద‌ర్ ఆయ‌న‌తో స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి గ‌ద్ద‌ర్‌ను రాహుల్ గాంధీ ఆహ్వానించారు. దీనికి గ‌ద్ద‌ర్ సైతం సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశం అనంత‌రం గ‌ద్ద‌ర్ మీడియాతో మాట్లాడుతూ, 75 ఏళ్లు దాటిన కాంగ్రెస్ సీనియ‌ర్లు కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. దీంతో పార్టీలో ఎంట్రీకి ముందే ప్ర‌జా యుద్ధ‌నౌక ష‌ర‌తులు పెడుతున్నార‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఈ స‌మావేశ అనంత‌రం రాహుల్ గాంధీ సంజీవయ్య పార్కుకు వెళ్తారు. అక్కడే దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పిస్తారు.

మధ్యాహ్నం12 గంటల 30 నిమిషాలకు చంచల్ గూడ జైలులో ఉన్న NSUI నేతలను కలిసేందుకు వెళతారు. ఒకటిన్నరకు గాంధీభవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమై.. పార్టీ అంశాలపై చర్చిస్తారు. 2 గంటల 45 నిమిషాలకు మెంబర్షిప్ కో ఆర్డినేటర్లతో భేటీ అవుతారు. సాయంత్రం రాహుల్ ఢిల్లీ బయల్దేరి వెళతారు.
Tags:    

Similar News