టీఆర్ఎస్ : మ‌రో ఎమ్మెల్యేకు ఉప ఎన్నిక భ‌యం

Update: 2015-08-02 07:36 GMT
అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఉప ఎన్నిక‌ల వేడి మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే స‌న‌త్‌ న‌గ‌ర్ ఎమ్మెల్యే తల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ పై అన‌ర్హ‌త వేటు టెన్ష‌న్ న‌డుస్తుంటే...మ‌రోవైపు ఇంకో ఎమ్మెల్యేను అదే ఇబ్బంది ప‌ట్టిపీడిస్తోంది. ఆయ‌నే జి.విఠ‌ల్ రెడ్డి.  ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ ఎమ్మెల్యే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. బీజేపీ అభ్యర్థి రమాదేవిపై గెలుపొందిన విఠ‌ల్ రెడ్డి కొద్ది రోజుల్లోనే విఠల్‌ రెడ్డి కాంగ్రెస్‌ కి హ్యాండిచ్చి కారెక్కేశారు. ఈ ఎమ్మెల్యేకు ఉపఎన్నిక భయం పట్టుకుందని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని అనర్హులుగా  ప్రకటించాలంటూ ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌ పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కొద్ది  రోజుల్లో జిల్లాలో ఉప ఎన్నికలొస్తాయని పార్టీ శ్రేణులతో చెప్పారు. అందరం కలిసి మన స్థానాన్ని మనం గెలిపించుకోవాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నిక వస్తే విఠల్‌ రెడ్డిని ఓడించాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలకు ఉత్తంం స్ప‌ష్టం చేశారు.

సాధారణంగా అధికార పార్టీ నుంచి బరిలో దిగితే విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ స్థానికంగా ఉన్న టీఆర్‌ఎస్‌  శ్రేణులు తనకు పూర్తిగా సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు విఠల్‌రెడ్డికి ఉన్నాయని తెలుస్తోంది. ఉప ఎన్నిక అనివార్యమయితే పార్టీలోని ఓ వర్గం హ్యాండిస్తుందేమో అన్న అనుమానం ఆయనకుందన్న చర్చ విఠల్‌రెడ్డి వర్గీయుల్లో జరుగుతోంది. విఠ‌ల్ రెడ్డి చేతిలో గ‌త ఎన్నిక‌ల్లో ఒడిపోయిన టీఆర్ఎస్ నాయ‌కుడు ఎన్నిక‌లు వ‌స్తే ఏకుమేకుగా మారుతాడ‌ని భావిస్తున్నారు. అయితే ఉపఎన్నిక వచ్చినా గెలుపు తనదేనని విఠ‌ల్ రెడ్డి పార్టీ అధినాయకత్వానికి చెప్తున్నార‌ట‌. ఎమ్మెల్యే వ్యూహాలు ఎంత వరకు సక్సెస్‌ అవుతాయో ఎన్నికలొస్తే గాని తెలియదు.
Tags:    

Similar News