వైఎస్ లాగా బాబు ఎందుకు చేయ‌ట్లే?

Update: 2017-05-23 17:53 GMT
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి నారాయణరెడ్డి హ‌త్య ఉదంతం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడును ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా చేస్తోంది. ఈ హ‌త్య‌పై త‌క్ష‌ణ చ‌ర్య‌లు ఏవీ లేక‌పోవ‌డంతో విప‌క్ష వైసీపీ ఘాటు ప్ర‌శ్న‌లు సందిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏపీ స‌ర్కారు తీరుపై ఘాటుగా స్పందించారు. 2019లో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలే త‌ప్ప హ‌త్యా రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రిపైనే ఆరోపణలు వస్తే నిరూపించుకోవాల్సింది పోయి నిందితులకు  పోలీసులే కొమ్ముకాయడం దారుణమన్నారు. పోలీసులు మనసు పెడితే హత్య కేసులో నిందితులను పట్టుకోవడం ఏమంత పెద్ద పనికాదని గ‌డికోట తెలిపారు.

సోషల్‌ మీడియా విషయంలో పక్కరాష్ట్రాలకు వెళ్లి మరీ అరెస్టులు చేశార‌ని నారాయణరెడ్డి హత్య చేయబడి 48 గంటలు దాటిపోయిన చ‌ర్య‌లు ఎందుకు లేవ‌ని గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. రాష్ట్రమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ``టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో మీరు గ‌గ్గోలు పెడితే...దివంగత నాయకుడు వైఎస్‌ఆర్‌ సీబీఐ విచారణకు ఆదేశించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వైఎస్‌ జగన్‌ నిర్దోషి అని సీబీఐ వెల్లడించింది. అదే విధంగా మీరు కూడా రంగా కేసులో ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే ధైర్యం ఉందా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలానే జరిగాయి. వాటిల్లో ఏ ఒక్కదానిపైనైనా విచారణకు ఆదేశించే దమ్ము చంద్రబాబుకు ఉందా..? ఆఖ‌రికి తాజా కేసులో ఉప ముఖ్య‌మంత్రిపై చ‌ర్య‌లు తీసుకునే ధైర్యం ఉందా?`` అని గ‌డికోట సూటిగా ప్ర‌శ్నించారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌తో రాష్ట్రంలో టీడీపీ నాయకులు పోలీసులపై దాడులు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఐపీఎస్‌ను తెలుగుదేశం పార్టీ సర్వీస్‌గా మార్చారని ఆక్షేపించారు. ``విజయవాడలో బోండా ఉమ, కేశినేని నాని ఐపీఎస్ ను అవమానిస్తారు..మీ పార్టీ నేత‌లు కడపలో పార్టీ ప్లీనరీలో ఎస్పీని స్మగ్లింగ్‌ కు ఎంకరేజ్‌ చేస్తున్నారని చెప్పుకుని వేధిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎస్సైని కింద కూర్చోబెడతారు. అధికారుల‌ను నిజాయతీగా వాళ్ల పనిని వాళ్లని చేయనీయడం లేదు. నిజాయతీతో పనిచేసేవారిని ట్రాన్స్‌ఫర్లతో వేధిస్తారు. సాక్షాత్తు ఏలూరు ఎస్సై పెట్టిన కేసును ఎత్తేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇస్తారు. ఇలాటి పరిస్థితుల్లో సామాన్యులకు ఏం భద్రత కల్పిస్తారు?`` అంటూ శ్రీ‌కాంత్ రెడ్డి సూటిగా నిల‌దీశారు.
Tags:    

Similar News