పూటుగా తాగి పోలీసుల‌కు చిక్కిన‌ ఉద్య‌మ నేత‌

Update: 2017-10-29 04:36 GMT
గ‌జ్జెల కాంతం! తెలంగాణ రాష్ట్ర పోరు స‌మ‌యంలో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు ఇది! త‌న‌దైన స్టైల్‌లో ఉద్య‌మ గీతాలు ఆల‌పిస్తూ.. త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తిపు పొందిన గ‌జ్జెల కాంతం అంద‌రినీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించారు. తెలంగాణ పాలించేవాడు తెలంగాణోడో కావాలంటూ.. స‌రికొత్త నినాదాన్ని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆక‌ర్షించారు. అటువంటి గ‌జ్జెల కాంతం తెలంగాణ ఏర్పాటు అనంత‌రం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఛాన్స్ ఇచ్చినా రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా రాకుండా త‌న స్టైల్‌ ను కొన‌సాగించారు. అప్ప‌టి నుంచి పెద్ద‌గా వార్త‌ల్లో క‌నిపించ‌కుండా పోయారు. అయితే, ప్ర‌జా సంఘాల జేఏసీకి చైర్మ‌న్‌ గా మాత్రం ఇప్ప‌టికీ గ‌జ్జ‌ల కాంతం కొన‌సాగుతున్నారు.

ఇంత వ‌ర‌కు బాగున్నా.. తాజాగా ఆయ‌న ప‌రువు పోయే ఘ‌ట‌న వెలుగు చూసింది. పూటుగా మందు తాగిన కాంతం.. ర‌య్ ర‌య్‌ న కారు న‌డుపుతూ.. పోలీసుల‌కు చిక్కారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం చేరుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే... తెలంగాణ‌లోని ఉద్య‌మ నేప‌థ్యం తీవ్రంగా ఉన్న జిల్లా కరీంనగర్ లో పోలీసులు  శనివారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద   డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు  బ్రీత్‌ అనలైజర్‌ లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  

గజ్జెల కాంతంకు మద్దతుగా కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని.. పోలీసులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు గజ్జెల కాంతంను అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను ప‌రీక్షించ‌గా ఉండాల్సిన స్థాయి క‌న్నా మద్యం పాళ్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. అయితే, ఏం జ‌రిగిందో ఏమో.. కాసేపటికి వదిలి పెట్టారు. పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. కాగా, గ‌జ్జెల కాంతం నిర్వాకంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News