చంద్రబాబుకు మరో షాక్, పార్టీకి గాజువాక మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై!

Update: 2020-09-06 10:10 GMT
తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మూడు రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఈ పార్టీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. తాజాగా, విశాఖపట్నం జిల్లాలో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడనున్నారని తెలుస్తోంది. పార్టీలోని బీసీ కీలక నేతల్లో పల్లా శ్రీనివాస్ ఒకరు. గత ఎన్నికల్లో ఆయన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.

2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఇదే గాజువాక నుండి గెలిచిన పల్లా శ్రీనివాస్ రావు, 2019లో వైసీపీ ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నేత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ను గెలిపించేందుకు చంద్రబాబు జనసేనతో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారనే వాదనలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ తరఫున నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు. స్వయంగా పల్లా శ్రీనివాస్ కూడా ప్రచారం కోసం రావాలని కోరారు. కానీ అధినేత రాలేదని అంటారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తాను ఓడిపోవడానికి ఓ విధంగా పార్టీ అధినేతనే కారణమని పల్లా శ్రీనివాస్ తన స్నేహితుల వద్ద కూడా చెప్పుకొని వాపోయారట. గత ఎన్నికల నుండి ఆయన పార్టీలోను కీలకంగా కనిపించడం లేదు. అతని తండ్రి పల్లా సింహాచలం మాజీ టీడీపీ ఎమ్మెల్యే. పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడనున్నారని చెబుతున్నప్పటికీ, బీజేపీలోకి వెళ్తారా, వైసీపీలోకి వెళ్తారా క్లారిటీ లేదంటున్నారు.


Tags:    

Similar News