క‌న్న‌డ‌లో రాజ‌కీయం..సిద్ధుపై గాలి ఆప్తుడి పోటీ

Update: 2018-04-25 07:21 GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానం నుంచి పోటీ చేయడానికి వీలుగా సీఎం సిద్దరామయ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటికే చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆయన మంగళవారం బాదామి నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలు సమర్పించారు. బాదామి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ సభ్యుడు - గిరిజన నాయకుడు బీ శ్రీరాములు పోటీ చేస్తున్నారు. శ్రీరాములుకు కూడా ఇది రెండో నియోజకవర్గం. ఇప్పటికే ఆయన చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్‌ మూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మే 12న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు మంగళవారంతో ముగిసింది.

తాజా ప‌రిణామాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా విశ్లేషిస్తున్నాయి. కరకంగా చెప్పాలంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై మైనింగ్‌ డాన్‌ గాలి జనార్ధనరెడ్డి పోటీ చేస్తున్నారనే చెప్పాల‌ని వ్యాఖ్యానిస్తున్నారు. బాగలకోట జిల్లా బాదామి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిసైడ‌వ‌గా...బాదామిలో తమ అభ్యర్థి ఎవరో చివరి క్షణం వరకు సస్పెన్స్‌లో ఉంచిన బీజేపీ… చివరి క్షణంలో బి. శ్రీరాములు పేరు వెల్లడించింది. దీంతో ఈ పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..బాదామిలో మొదట్నుంచి కుల రాజకీయాలకే ప్రాధాన్యం. అభ్యర్థి కులాన్ని బట్టి ఓట్లు వెయ్యడం ఇక్కడ సర్వసాధారణమని చరిత్ర చెబుతోంది. కురబ సామాజిక వర్గం ఇక్కడ అత్యంత కీలకం. మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కురబలు 55 వేలు వరకు ఉన్నారు.  కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్దరామయ్య అందుకే బాదామిని సురక్షితంగా భావించి పోటీలోకి దిగారు. బాదామిలో ఎస్టీలు కూడా అత్యధికంగా 36 వేల మంది వరకు ఉండడంతో బీజేపీ వాల్మీకి నాయక  (ఎస్టీ) వర్గానికి చెందిన శ్రీరాముల్ని పోటీకి దించింది. దీంతో అంద‌రి చూపు బాదామి నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది.

మ‌రోవైపు మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దనరెడ్డి రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. మైనింగ్‌ కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచి లో ప్రొఫైల్‌ లో ఉన్న గాలి.. ఆదివారం యాడ్యూరప్ప - మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తో కలిసి మొలకల్మూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓ ముఖ్యమంత్రి - ఓ ముఖ్యమంత్రి అభ్యర్థితో గాలి.. వేదికను పంచుకున్నారు. ‘అబ్బే.. జనార్దనరెడ్డితో మాకేం సంబంధం లేద’ని మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కర్ణాటకలో ప్రకటించగా.. ఇప్పుడు ఒకే వేదికపై యాడ్యూరప్ప, గాలి కనిపించడం గమనార్హం. ఈ సందర్భంగా యాడ్యూరప్ప మాట్లాడుతూ గాలి రాక ఏనుగంత బలం అని వ్యాఖ్యానించగా ఆయన కాళ్లకు జనార్దనరెడ్డి దండం పెట్టారు. ఈ ఎన్నికల్లో గాలి సోదరులు సోమశేఖరరెడ్డి - కరుణాకరరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు గడువు ఉంది. వచ్చే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 15న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
Tags:    

Similar News