చంద్రబాబు పిలిచి మాట్లాడినా మారని గల్లా

Update: 2015-10-23 11:54 GMT
ఏపీ రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమీ ప్రకటించడం లేదంటూ మొదలుపెట్టిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సొంత పార్టీ పైనా విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలూ అందరికీ తెలిసినవే. జయదేవ్ గుంటూరు ఎంపీ.. అంటే రాజధాని ఎంపీ అన్న మాట. కానీ, రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై ఆయన పేరే లేదు. దాంతోనే ఆయనకు ఆగ్రహం వచ్చింది... అగ్నికి ఆజ్యం పోసేలా కేసీఆర్ పేరు అందులో పొందుపరిచారు. కేసీఆర్ తో ఆయనకు ఎలాంటి వైరం లేకపోవచ్చు కానీ, స్థానిక ఎంపీ పేరు లేకుండా పొరుగు రాష్ట్రం సీఎం పేరు ఎలా పెడతారన్నది ఆయన కోపానికి కారణమని అనుచరులు చెబుతున్నారు.ఆ కోపంతోనే ఆయన మోడీ - టీడీపీలపై విరుచుకుపడ్డారు. దీంతో చంద్రబాబు ఆయన్ను పిలిచి మాట్లాడారు. చంద్రబాబు గల్లాకు ఏం చెప్పారో ఆయన ఎలా రెస్పాండయ్యారో తెలియదు కానీ, బయటకొచ్చి గల్లా మాట్లాడిన మాటలు వింటే మాత్రం ఆయనేమీ మెత్తబడినట్లుగా లేదు. కేవలం భాష మారింది కానీ, భావంలో ఏమాత్రం మార్పు లేదు. ఏమీ లేదంటూనే ఎత్తిపొడుపుతనం ఆయన మాటల్లో ధ్వనించింది.

తాను శిలాఫలకాలపై పేర్ల కోసం పాకులాడేవాడిని కానని.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జాతీయ స్థాయి కార్యక్రమం కాబట్టి మన ఆలోచనలూ అలాగే ఉండాలని జయదేవ్ అన్నారు.  ఢిల్లీ స్థాయి కార్యక్రమంలో లోకల్ సర్పంచి గురించి ఆలోచించం కదా అని అన్నారు. అతిథులను గౌరవించడం మన సంప్రదాయమని అంటూ పరోక్షంగా కేసీఆర్ పేరు శిలాఫలకంపై చేర్చడాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. దీనిపై వివాదాలు వెతకడం మానేసి విజయవంతం అయినందుకు సంతోషించాలంటూ చివర్లో ముక్తాయించేశారు.

Tags:    

Similar News