పంచ్ః ఎన్టీఆర్ త‌ర్వాత కేసీఆరే!

Update: 2016-11-18 10:43 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుపై కాంగ్రెస్ నాయ‌కుడు - మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన సెటైర్ వేశారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు - దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నటుడైన తర్వాత ప్రజల నాయకుడయ్యాడు కాని కేసీఆర్‌ నాయకుడైన తర్వాత న‌టిస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ త‌న‌ అసమాన నటనతో ప్రజలను మోసం చేస్తున్నాడని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో గండ్ర మాట్లాడుతూ రైతు రుణమాఫీ - ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను చూస్తుంటే ఏ విధ‌మైన విమ‌ర్శ‌లు చేయాలో కూడా అర్థం కావ‌డంలేద‌ని అన్నారు.

గుజరాత్‌ తర్వాత రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప‌దే ప‌దే చెప్పే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంత‌టి ఆర్థిక బ‌లోపేతం ఉండి కూడా రైతాంగానికి ఏక కాలంలో రుణమాఫీ చేసిన పాపన పోలేదని గండ్ర విమ‌ర్శించారు.  పేద విద్యార్థులు రీయింబర్స్‌ మెంట్‌ పై గంపెడాశతో ఉన్నత చదువులు చదవాలని ఆశపడుతుంటే వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన ఇల్లును బంగారం చేసుకోవాలనే తపనతో బంగారు తెలంగాణ సాధిస్తానని కేసీఆర్‌ గొప్పలు  చెబుతున్నాడే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని ఎద్దేవా చేశారు. దేశంలో గతంలో ఎన్నుడూ లేని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోడుసాగు చేసుకుంటూ జీవిస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక చట్టం ద్వారా వారికి పట్టాలు అందిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములు లాక్కొని రైతుల ఉసురు పోసుకుంటుందని గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ‌ను అభివృద్ధి చేస్తాడ‌నే ఉద్దేశంతో ఓట్లు వేసిన ప్ర‌జల‌కు ఇపుడు వాస్త‌వం తెలిసి వ‌చ్చింద‌ని త్వ‌ర‌లో రాబోయే ఏ ఎన్నిక‌ల్లో అయినా స‌రైన గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని గండ్ర జోస్యం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News