నిజామాబాద్ జిల్లా జైలు వెనుకాల గ్యాంగ్ రేప్

Update: 2019-09-21 05:08 GMT
ఘోరం జరిగింది. ఒక వ్యక్తిని నమ్మిన మహిళపై దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా జైలు వెనుక భాగంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటో డ్రైవర్ మాయమాటలు విని మోసపోయిన మహిళ ఏకంగా గ్యాంగ్ రేప్ కు గురైంది. ఇంతకూ ఏం జరిగిందంటే..

నిజామాబాద్ నగర శివారుకు చెందిన 24 ఏళ్ల బాధిత మహిళ పేద కుటుంబానికి చెందింది. పని చేస్తే కానీ బతకని పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఊరికి 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఏడాది క్రితం పనికి కుదిరింది. ఊరి నుంచి ఫ్యాక్టరీకి వెళ్లేందుకు షేర్ ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలో ఆటోడ్రైవర్ సురేశ్ తో పరిచయమైంది.

మాయ మాటలతో అమాయక యువతిని వలలో వేసుకున్న అతగాడు.. తనకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచి పెట్టాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న అతడు.. సారంగాపూర్ హనుమాన్ ఆలయానికి వెళదామని చెప్పి.. శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో ఎక్కించుకొని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న జిల్లా జైలు వెనుక భాగంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అక్కడితే అతగాడి దురాగతం ఆగలేదు. తన ఫ్రెండ్స్ అయిన మరో ఆరుగురిని అక్కడకు పిలిపించుకొని.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మొత్తం దుర్మార్గాన్ని మరో ఇద్దరు యువకులు వీడియో తీశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియోను తీసిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత జిల్లా జైలు పరిసర ప్రాంతంలో ఆటో ఆపి.. ఫోన్లో వీడియో చూస్తున్నారు. అదే సమయంలో అక్కడకు స్థానిక పోలీసులు రావటం.. వారి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. తమదైన రీతిలో వారిని విచారించారు.

దీంతో.. జరిగిన దారుణాన్ని వెల్లడించారు. బాధితురాలిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీడియో చూస్తున్న ఇద్దరూ.. జరిగిన దుర్మార్గాన్ని వీడియో షూట్ చేశారే కానీ.. మరేం చేయలేదని బాధిత మహిళ వెల్లడించింది. తనపై ఏడుగురు అత్యాచారం చేయటం నిజమేనని ఆమె పేర్కొంది. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులందరూ ఆటో డ్రైవర్లేనన్న విషయాన్ని గుర్తించారు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో వారి కోసం వెతుకుతున్నారు.


Tags:    

Similar News