రవిశాస్త్రే కోచ్.. గంగూలీ ఎలా ఒప్పుకున్నాడు?

Update: 2017-07-12 07:08 GMT
మొత్తానికి కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు కోచ్ గా నియమితుడయ్యాడు. కెప్టెన్ కోహ్లికి అత్యంత ఇష్టుడు కావడం.. ఇంతకుముందు భారత జట్టుకు డైరెక్టర్ గా పని చేసి మంచి ఫలితాలు రాబట్టిన అనుభవం ఉండటం రవిశాస్త్రికి కలిసొచ్చింది. అన్నింటికీ మించి.. కోచ్ ను ఎంపిక చేసిన క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడైన సచిన్ టెండూల్కర్ మద్దతుండటం రవిశాస్త్రికి కలిసొచ్చింది. అసలు గత ఏడాది తనకు కాదని కుంబ్లేకు కోచ్ పదవి కట్టబెట్టినందుకు మనస్తాపం చెందిన రవిశాస్త్రి ఈసారి కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికే అంగీకరించలేదు. కానీ సచినే బలవంతంగా దరఖాస్తు చేయించి.. అతను కోచ్ గా ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐతే నిరుడు రవిశాస్త్రిని తీవ్రంగా వ్యతిరేకించి.. కుంబ్లేకు కోచ్ పదవి దక్కేలా చేసిన గంగూలీ.. ఈసారి అతడిని ఎలా ఒప్పుకున్నాడన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. తనకు పదవి దక్కకపోవడానికి గంగూలీయే కారణమని రవిశాస్త్రి గత ఏడాది పరోక్షంగా విమర్శలు గుప్పించడం.. గంగూలీ కూడా దీటుగా బదులివ్వడం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రికి గంగూలీ పచ్చ జెండా ఊపడం వెనుక కొంత డ్రామా నడిచినట్లు సమాచారం. నిజానికి గంగూలీ మొగ్గు సెహ్వాగ్ వైపే ఉందట. అతడే కోచ్ కావాలని పట్టుబట్టాడట.

ఐతే సచిన్ జోక్యం చేసుకుని.. కోహ్లితో పాటు జట్టు సభ్యులు రవిశాస్త్రినే కోరుకుంటున్నారని.. వారి అభిప్రాయాన్ని గౌరవించాలని చెప్పి.. గంగూలీని ఒప్పించే ప్రయత్నం చేశాడట. గంగూలీ అభీష్టం ప్రకారం జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ చేయడానికి సచిన్ తో పాటు కమిటీలో మరో సభ్యుడైన లక్ష్మణ్ కూడా అంగీకరించాకే అతను రవిశాస్త్రికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి ఇంతకుముందు డైరెక్టర్ గా ఉన్నపుడు భరత్ అరుణ్ ను తనకు సాయంగా బౌలింగ్ కోచ్ గా ఎంచుకున్నాడు. ఈసారి కూడా అతనే కావాలని అడగ్గా.. గంగూలీ మాత్రం జహీర్ పేరు తెరమీదికి తెచ్చాడు. మరోవైపు ద్రవిడ్ ను విదేశీ పర్యటనల కోసం బ్యాటింగ్ సలహాదారుగా నియమించడంలోనూ గంగూలీ పాత్ర కీలకమట. జహీర్.. ద్రవిడ్ లాంటి కమిట్మెంట్ ఉన్న మాజీ ఆటగాళ్లకు కీలక పదవులు దక్కిన నేపథ్యంలో రవిశాస్త్రి మీద వ్యతిరేకతను పక్కన పెట్టి అతణ్ని ప్రధాన కోచ్ గా నియమించడానికి గంగూలీ ఓకే చెప్పినట్లు సమాచారం. రవిశాస్త్రి.. జహీర్.. ద్రవిడ్ రెండేళ్ల పాటు.. అంటే 2019 వన్డే ప్రపంచకప్ వరకు పదవుల్లో కొనసాగుతారు.
Tags:    

Similar News