ఐపీఎల్ ప‌రిస్థితిపై గంగూలీ ఆశ్చ‌ర్యం!

Update: 2021-05-06 16:30 GMT
ఆట‌గాళ్ల‌కు క‌రోనా వ్యాపించ‌డంతో ఐపీఎల్ ను అర్ధంతరంగా నిలిపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తాజాగా స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దాదా.. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు. అస‌లు కొవిడ్ ఎలా అటాక్ చేసిందో అర్థం కావ‌ట్లేద‌ని అన్నారు.

బ‌యోబ‌బూల్ న‌డుమ ఐపీఎల్ ను కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. దాన్ని ఛేదించుకుని మ‌రీ ఆట‌గాళ్ల‌ను క‌రోనా ఎలా తాకిందో తెలియ‌ట్లేద‌ని అన్నారు. బ‌హుశా అటూ ఇటూ ప్ర‌యాణాలు చేయ‌డం వ‌ల్ల‌నే ఈ స‌మ‌స్య వ‌చ్చి ఉండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

ఇక‌, ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మైన‌ సంగ‌తి తెలిసిందే. వీటిపైనా గంగూలీ స్పందించారు. తాము టోర్నీ నిర్వ‌హించాల‌ని అనుకున్న‌ప్పుడు కొవిడ్ ఈ స్థాయిలో లేద‌ని చెప్పారు. అప్పుడు ఎవ్వరూ అభ్యంత‌రం చెప్ప‌లేద‌న్న సౌర‌వ్.. ఇప్పుడు జ‌నం ఎన్నైనా చెబుతార‌ని అన్నారు.

ఇక‌, టీ-20 ప్ర‌పంచ క‌ప్ ఇండియాలో నిర్వ‌హించాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో నిర్వ‌హ‌ణ సాధ్య‌మేనా అన్న ప్ర‌శ్న‌కు లేద‌ని మాత్రం చెప్ప‌లేదు సౌర‌వ్‌. దాని గురించి ఇప్పుడే మాట్లాడ‌డం స‌రికాద‌ని, ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని చెప్పారు.

ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగే ఐసీసీ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ మాత్రం కొన‌సాగుతుంద‌ని, అందులో భార‌త ఆట‌గాళ్లు పాల్గొంటార‌ని చెప్పారు. ఇంగ్లండ్ వెళ్లి, క్వారంటైన్ ఫేస్ చేసిన త‌ర్వాత‌.. మ్యాచ్ ఆడ‌తార‌ని గంగూలీ వెల్ల‌డించారు.
Tags:    

Similar News