మంత్రి కేటీఆర్ తో 'గంటా' భేటి? ఏం మాట్లాడుకున్నారు?

Update: 2021-03-20 09:57 GMT
ఏపీ టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆశ్చర్యపరిచారు. తెలంగాణ వచ్చి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తో భేటి అయ్యారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్ తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలుపడంతో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు గంటా కలిసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము సైతం ఉద్యమిస్తామని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఈ భేటిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రప్రభుత్వ ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతానన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు  అందరి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News