ముద్రగడపై గంటా మార్క్ ఫైరింగ్

Update: 2016-06-08 07:24 GMT
కాపు ఉద్యమ నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీద ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తుని విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై ముద్రగడ తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో పాటు.. తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు మంగళవారం ఆయన చుక్కలు చూపించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముద్రగడను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ సర్కారు సంశయించటం.. ఆయన్ను బుజ్జగించి ఇంటి దగ్గర వదిలేందుకు పోలీసులు పడిన శ్రమ అంతాఇంతా కాదు.

ముద్రగడ వైఖరి మీద ఏపీ అధికారపక్ష నేతలు మంగళవారం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపించింది. దీనికి భిన్నంగా బుధవారం ఏపీ మంత్రులు చినరాజప్ప.. గంటా శ్రీనివాసరావులు మాటల దాడి స్టార్ట్ చేశారు. తుని ఘటనలో నేరస్తులపై కేసులు ఎత్తేయమని డిమాండ్ చేస్తే ముద్రగడను క్రిమినల్ గా భావించాల్సి ఉంటుందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన కాపు యువకులపై కేసులు ఎత్తి వేయాలన్న ముద్రగడ మాటపై తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. అరెస్ట్ అయిన వారంతా అమాయకులైతే.. విధ్వంసానికి పాల్పడిన వారు ఎవరు? ఆ విషయాన్ని ముద్రగడే వెల్లడించాలంటూ మండిపడ్డారు.

ముద్రగడ కారణంగా కాపు జాతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆవేదనను గంటా వ్యక్తం చేశారు. మరోవైపు చినరాజప్ప మాట్లాడుతూ.. తుని నిందితుల పట్ల చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఒత్తిళ్లకు తలొగ్గమంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. మరి.. కాపు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News