అసలు గంటా ప్లానేంటి?

Update: 2016-04-16 11:30 GMT
ఏపీ కేబినెట్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. గంటా తీరుపై చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయట. ముఖ్యంగా చిరంజీవితో, ఆయన కుటుంబసభ్యులతో గంటా రాసుకుపూసుకొని తిరుగుతున్నారని... చిరంజీవిని లైమ్ లైట్లోకి తెచ్చే వ్యవహారాలకు గంటా తెర వెనుక ప్రణాళికలు రచిస్తున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నట్లుగా సమాచారం. ఇంటిలిజెన్సు నివేదికలూ గంటా వ్యవహారాలను ముఖ్యమంత్రికి నివేదించాయట.
    
కొన్ని వ్యవహారాల్లో గంటా ఆటలు చంద్రబాబు ముందు సాగడం లేదు. మరోవైపు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరి మంత్రి పదవి అందుకోవడం గంటాకు అలవాటుగా వస్తుంది. అయితే... ఆయన కాంగ్రెస్ లోనే ఎక్కువ కాలం కొనసాగడం... ఒకే సామాజికవర్గం కావడంతో చిరంజీవితో గంటాకు మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా గంటా తన కుమారుడిని సినీహీరో చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ఆశీస్సులు ఉంటే ఇండస్ర్టీలో నెట్టుకురావొచ్చన్న భావన ఆయనకు ఉండొచ్చు. అయితే... కాపులకు ఐకాన్ గా పేర్కొనే చిరంజీవిని ముందు పెట్టి ఏమైనా కాపు రాజకీయాలు చేసే ప్లాన్లు వేస్తున్నారా అని చంద్రబాబు అనుమానిస్తున్నట్లుగా సమాచారం. గంటా వ్యవహారం కూడా కాస్త అనుమానాస్పదంగానే ఉందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
    
రీసెంటుగా విశాఖలో సరైనోడు సినిమా ఆడియో ఫంక్షన్ చేశారు. ఆ వేడుక బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందుకు కారణం గంటాయేనట. గంటా జనసమీకరణ వల్లే సరైనోడు ఆడియో ఫంక్షన్ అదిరిపోయిందని ఏపీ ఇంటెలిజెన్సు వర్గాలు చంద్రబాబుకు నివేదించాయట. అప్పటి నుంచి గంటా అంటే చంద్రబాబు రగిలిపోతున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవితో ఏపీ మంత్రిగా ఉన్న గంటా అంతలా సంబంధాలు మెంటైన్ చేయడం ఎలాంటి సంకేతాలు పంపిస్తుందంటూ చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట.
    
రాజకీయంగా ఫేడవుట్ అవుతున్న చిరంజీవిని మళ్లీ లైమ్ లైట్ లోకి తేవడానికి గంటా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మంత్రివర్గంలోని కొందరు సన్నిహితులు వద్ద అన్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని మళ్లీ బలోపేతం చేసే పనులు చేస్తున్న గంటాకు చెక్ పెట్టేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఆ కారణంగానే గంటా విషయంలో కాస్త కఠినంగా ఉండాలని నిర్ణయించారని.. గంటా పంపించే ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరం లేదని, గంటా చేసే సిఫారసులను తన దృష్టికి తెచ్చాకే నిర్ణయం తీసుకోవాలని సీఎంఓ అధికారులకు చంద్రబాబు ఆదేశించినట్లుగా వినిపిస్తోంది.  ఆంధ్ర యూనివర్సిటీ వీసీ విషయంలోనూ లోకేశ్ - చంద్రబాబులతో గంటా ఇప్పటికే విభేధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయం ఎలా మారుతుందో.. గంటా ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.
Tags:    

Similar News