అయ్యన్న ఎపిసోడ్ : గంటా నోరిప్పలేదా... ఎందుకలా...?

Update: 2022-06-25 02:30 GMT
కొద్ది రోజుల క్రితం నర్శీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహారీ గోడను హఠాత్తుగా కూల్చేశారు. బుల్దోజర్లు పెట్టి మరీ మిగిలిన భాగాన్ని కూడా పడగొట్టాలని చూశారు. దాంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. టీడీపీ శ్రేణులు అంతా చలో నర్శీపట్నం అని కదిలాయి. ఇక చంద్రబాబు నుంచి లోకేష్ బాబు నుంచి మొదలుపెడితే అచ్చెన్నాయుడు సహా అందరూ కూడా అయ్యన్నకు బాసటగా నిలిచి వైసీపీ సర్కార్ మీద చెడుగుడు ఆడారు.

ఇంత జరిగినా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నోరిప్పకవపోవడం మీద చర్చ సాగుతోంది. టాప్ టూ బాటం అంతా అయ్యో  అయ్యన్న ఆని సానుభూతి చూపారు. వైసీపీ మీద విరుచుకుపడ్డారు. బీసీలకు అన్యాయం అని కూడా గర్జించారు. కానీ గంటా పెదవి వెంట ఒక్క మాట రాలేదని టీడీపీలో చర్చ సాగుతోంది.

ఒకే పార్టీలో ఉంటున్నా ఈ ఇద్దరి మధ్యన ఉన్న రాజకీయ విభేదాలే కారణమా అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. దీనికి కొద్ది నెలల ముందు పార్టీలో బురదపాములు ఇపుడే మేలుకొంటున్నాయని వాటిని దరిచేరనీయవద్దు అంటూ అయ్యన్నపాత్రుడు బాబుకు సూచిస్తూ  ఇండైరెక్ట్ గా గంటా మీద చేసిన కామెంట్స్ తో ఆయన వర్గం మండిపడింది. దాని తరువాత చంద్రబాబు  కూడా గంటాను దగ్గరకు తీశారు.

ఇపుడు గంటా టీడీపీలో తన వరకూ తాను మంచి గౌరవాన్నే పొందుతున్నారు. ఆయనకు కొన్ని టాస్కులు బాబు అప్పగించారని చెబుతున్నారు. దాన్ని పూర్తి చేసి టీడీపీ మళ్ళీ గెలిచేలా ఉత్తరాంధ్రాలో జెండా ఎగిరేలా చేస్తాను అని ఆయన అంటున్నారు. సరే దాని సంగతి అలా పక్కన పెట్టినా అయ్యన్న ఎపిసోడ్ లో గంటా ఇది తప్పు అని మాట్లాడాలి కదా అన్నదే అంతా అంటున్నారు.

మరి ఆయన సైలెంట్ గా ఉండడం అంటే అయ్యన్నతో తన విభేదాలు కంటిన్యూ అన్న సిగ్నల్స్ ఇచ్చినట్లేనా అని కూడా చర్చిస్తున్నారు. మరి ఈ విధంగా సీనియర్ నాయకులు ఉంటే పార్టీ ఎలా ఎత్తిగిల్లుతుంది అని కూడా తమ్ముళ్ళు కలత చెందుతున్నారు.

మొత్తానికి ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపితే  సునాయాసంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ విజయపతాకం ఎగరవేస్తుంది అని అంటున్నారు. అయితే అది జరిగేపనేనా అన్నది చూడాలి.
Tags:    

Similar News