గంటకో మాట మాట్లాడుతున్న - గంటా

Update: 2019-02-23 15:45 GMT
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారే నేతల్లో మొట్టమొదటి పేరు మంత్రి గంటా శ్రీనివాసరావుది. నిన్నమొన్నటి వరకు ఉన్న పరిస్థితులను చూసి ఆయన ఈసారి నియోజకవర్గం మారబోరని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా ఆయన ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ మొత్తానికైతే నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు.
    
2009లో అనకాపల్లి ఎంపీగా పనిచేసిన గంటా 2014లో భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి భీమిలి నియోజకవర్గం టికెట్‌ను అవంతి శ్రీనివాస్ కోరినా కూడా గంటా అందుకు అంగీకరించలేదు. చివరకు అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు గంటా తాను భీమిలి నుంచి పోటీ చేయబోనని చెబుతున్నారట. విశాఖ ఎంపీ సీటు కావాలని చంద్రబాబు వద్ద ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే.. అశోక్ గజపతి రాజుతో గంటాకు ఏమాత్రం పొసగదు కాబట్టి అక్కడ పోటీ చేయడానికి వెనుకాడుతున్నారట.
    
మరోవైపు విశాఖ ఎంపిగా పోటీ చేయటానికి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ రంగం సిద్దం చేసుకున్నారు. మాజీ ఎంపి, గీతం విద్యాసంస్ధల వ్యవస్ధాపకుడు ఎంవివిఎస్ మూర్తి మనవడే ఈ భరత్.. ఆయనకు బాలయ్య, చినబాబు లోకేశ్ హామీ ఇచ్చారని కూడా పార్టీలో టాక్. ఇదంతా తెలిసి కూడా గంటా విశాఖ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అయితే... అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడంతో భీమిలిలో ఆయన్ను ఎదుర్కోవడం కష్టమన్న భయంతోనే గంటా ఇప్పుడీ ప్లాను మార్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి గంటకో వేషం వేస్తున్న గంటాతో చంద్రబాబుకు పెద్ద తంటాయే వచ్చిందంటున్నారు టీడీపీ నేతలు.

Tags:    

Similar News