సీట్ రెడీ...పార్టీ మాత్రం...?

Update: 2021-12-25 15:33 GMT
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల కోసం యాక్షన్ ప్లన రెడీ చేస్తున్నారు. ఆయన చాలా కాలం తరువాత బాగా యాక్టివ్ అవుతున్నారు. వరసబెట్టి నేతలతో భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తన సొంత సామాజికవర్గం వారితో ఆయన ఇంకా సన్నిహితంగా ఉంటున్నారు. ఏపీని కాపులే శాసించాలి అని ఆయన అన్న మాటలు ఆ కులానికి ఎంతో ఊపు ఇచ్చాయ‌ని అంటున్నారు.

ఇక గంటా రాజకీయం ఒక్కసారిగా జోరందుకుంది. అయితే ఆయన ఏ పార్టీ మనిషి అన్నది మాత్రం ఈ రోజుకీ సస్పెన్స్ గా ఉంది. గంటా టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే. అందులో రెండవ మాటకు అసలు తావు లేదు. కానీ ఈ మధ్య జరిగిన చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ కి ఆయన దూరంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు రెండున్నరేళ్ల తరువాత అసెంబ్లీ బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. కానీ గంటా సమావేశాలకు రావడం ఎపుడో తగ్గించేశారు. టీడీపీ పార్టీ ఆఫీస్ కి బొత్తిగా రావడం లేదు.

అయినా తాను పార్టీ మారలేదు అని ఆయన మీడియా అడిగితే చెబుతారు. తాను పార్టీ మారితే ముందు మీడియాకే చెబుతాను అని ఆయన అంటారు. ఇక టీడీపీలో గంటా ఇమడలేరు అన్న టాక్ అయితే ఉంది. జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో ఆయనకు విభేదాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. పార్టీలో చూసుకుంటే చంద్రబాబు వరకూ గౌరవిస్తానని గంటా అంటారు. కానీ అక్కడ మరొకరు పెత్తనం చేస్తే మాత్రం ఆయన తట్టుకోలేరు అని చెబుతారు. ఆ పెత్తనం యువ నేత లోకేష్ దే అని కూడా అంటారు.

ఇక టీడీపీకి దూరం అయితే గంటా ఏ పార్టీలో చేరుతారు అన్నదే ఇపుడు చర్చ. అయితే ఆయనకు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం వల్ల జనసేనలో కీలక పాత్ర పోషిస్తారు అంటున్నారు. పవన్ పార్టీకి ఉత్తరాంధ్రాలో అతి పెద్ద దిక్కు అవుతారు అని కూడా టాక్ నడుస్తోంది. అయితే అది కూడా ఇపుడే కాదు అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే అధికార వైసీపీ మీద పూర్తి వ్యతిరేకత అయితే జనాల్లో లేదు. అది గంటా కూడా అంచనా వేసుకుంటున్నారు అని తెలుస్తోంది. అందువల్ల ఆయన అన్ని ఆప్షన్లు దగ్గరపెట్టుకుని మరీ తన పని తాను చేసుకుని పోతున్నారు.

విశాఖ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో గంటా పోటీ చేయడానికి సీట్లు అయితే రెడీ అయిపోయాయి. ఆయన చూపు భీమిలీ మీద ఉందని టాక్. అక్కడ ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా అయిదేళ్ల పాటు టీడీపీలో పనిచేశారు. కాబట్టి అచ్చివచ్చిన సీటు అని భావిస్తున్నారు. అక్కడ టీడీపీకి లీడర్ లేరు, అలాగే జనసేనకు కూడా లేరు, అయితే ఆయన భీమిలీలో పోటీ చేస్తే మంత్రి అవంతి శ్రీనివాసరావుతో డైరెక్ట్ ఫైట్ చేయాలి.

ఒక వేళ అది కాదు అనుకుంటే చోడవరం సీటు ఉంది అని చెబుతున్నారు. చోడవరం నుంచి గంటా 2004లో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడింది. దాని తరువాతనే ఆయన 2008లో ప్రజారాజ్యంలో చేరి 2009 ఎన్నికలో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. సో ఇపుడు గంటా చూపు చోడవరం మీద ఉంది అంటున్నారు.

ఆయన అక్కడ నాయకులతో కూడా మాట్లాడుతున్నారుట. దాంతో గంటా చోడవరం రావడం ఖాయమని అంటున్నారు. ఇటు భీమిలీ అటు చోడవరం గంటా కోసం రెడీగా ఉన్నాయి. ఇంతకీ గంటా పోటీ చేసేది ఏ పార్టీ నుంచి అంటే అది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్ అంటున్నారు. మరి గంటా ఆ విషయం చెప్పాలీ అంటే 2024 రావాల్సిందే. ఏది ఏమైనా గంటా మార్క్ పాలిటిక్స్ తో విశాఖ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.


Tags:    

Similar News