మంత్రి గంటా ‘ఆస్తులు’ బ్యాంకులు స్వాధీనం?

Update: 2016-12-30 04:45 GMT
మంచి సౌండ్ పార్టీగా.. ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన షాకింగ్ విషయంగా దీన్ని చెప్పాలి. ఏపీ మంత్రుల్లో పారిశ్రామికవేత్తలుగా..వ్యాపారవేత్తులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో మంత్రిగంటా శ్రీనివాసరావు ఒకరు. ఆయనకు చెందిన ఆస్తుల్ని బ్యాంకు స్వాధీనం చేసుకుంటామంటూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సంచలంగా మారింది. అయితే.. ఈ ప్రకటనలో ఆయన పేరు ఒక్కటే కాదు.. ఆయన బంధువులు.. సన్నిహితుల పేర్లు ఉన్నాయి. వ్యాపారం కోసం బ్యాంకు దగ్గర తీసుకున్న వందల కోట్లలో ఒక్కటంటే ఒక్క వాయిదా కూడా తిరిగి చెల్లించకపోవటం ఒక విశేషమైతే.. బ్యాంకు విడుదల చేసిన ప్రకటన విషయంపై మంత్రి గంట తనదైన శైలిలో చెబుతున్నారు.

ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తే.. ఏపీ రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా.. ఆయన బంధువులు.. సన్నిహితులు.. స్నేహితుల.. వ్యాపార భాగస్వామలు రుణ ఎగవేతదారులుగా పేర్కొంటూ విశాఖపట్నంలోని ఇండియన్ బ్యాంకు ఒక నోటీసు జారీ చేసింది. దీని ప్రకారం.. విశాఖలోని వన్ టౌన్ లో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ 2005 ఆగస్టు 18న కంపెనీల చట్టం కింద రిజిష్టర్ అయ్యింది. ఈ సంస్థలో గంటా తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కరరావు.. ఆయన సోదరుడు రాజారావు.. వెంకయ్య ప్రభాకరరావులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

మంత్రి గంటాతో పాటు కొండయ్య.. బాలసుబ్రమణ్యం.. నార్నె అమూల్యలతో పాటు ప్రత్యూష ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్.. ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ లు ప్రధాన హామీదారులుగా(గ్యారెంటార్లుగా) ఉన్నారు. సంస్థ విస్తరణ అవసరాల కోసం విశాఖలోని ఇండియన్ బ్యాంకు డాబా గార్డెన్ బ్రాంచి నుంచి రూ.141.68కోట్లను తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత ఒక్క ఇన్ స్టాల్ మెంట్ కూడా కట్టలేదు. ఈ ఏడాది డిసెంబరు 13 నాటికి తీసుకున్న రుణానికి వడ్డీని కలుపుకుంటే బాకీ మొత్తం రూ.196.51 కోట్లుగా లెక్క తేలింది.

బ్యాంకు నుంచి తీసుకున్న బాకీ మొత్తాన్ని చెల్లించాలంటూ ఈ అక్టోబరు 4న డిమాండ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 60 రోజుల్లో రుణ బకాయిని చెల్లించాలని పేర్కొంది. అయినప్పటికీ.. రుణ చెల్లింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో అప్పు తీసుకోవానికి పెట్టిన  ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం మొదలైంది. ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరగటానికి వీల్లేదని.. అలా జరిపిన వారు బాధ్యులవుతారని బ్యాంకు హెచ్చరించింది.

పోర్టు వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన కంపెనీలో మంత్రి గంటా కొంతకాలం కొనసాగారు. ఇదిలా ఉండగా.. ప్రత్యూష కంపెనీలో ఒకప్పుడు తాను డైరెక్టర్ గా ఉన్నానని.. ఆ మాట వాస్తవమేనని.. ప్రస్తుతం ఆ కంపెనీకి తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలులేవని.. బ్యాంకులో తీసుకున్న రుణాలకు గ్యారెంటార్ గా ఉన్నానని.. బకాయిలు చెల్లించకపోవటంతో తనకు నోటీసులు ఇచ్చారంటూ గంటా వ్యాఖ్యానించారు. బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాల్ని చెల్లించమని చెబుతానని ఆయన చెప్పారు.

స్వాధీనం చేసుకున్న ఆస్తులివే..

- బాలయ్య శాస్త్రి లే అవుట్‌ పరిధి సర్వే నెంబర్‌ 20 (పి)లోని ప్లాట్‌ నెంబర్‌ (ఎ) (12)లోని 444 చదరపు గజాల విస్తీర్ణంలోని అవిభాజ్య భూమి.

- నిర్మాణంలో ఉన్న త్రివేణి ప్లాట్‌ - 11

- కూర్మన్నపాలెంలోని సర్వే నెంబర్‌ 113-20 - 113-21 - 113-22ల్లో 1446 చదరపు గజాల భూమి

- అనకాపల్లి ఎన్‌హెచ్‌ 5 రోడ్డులోగల పూడిమడక జంక్షన్‌ లోని సర్వే నెంబర్‌ 787-3, 788-3, 788-4, 788-6లోగల 0.6766 ఎకరాల భూమి

- చోడవరం మండలంలోని కొత్తూరు మెయిన్‌ రోడ్డులోని 1355 చదరపు గజాల భూమి

- విశాఖ ఎంవిపి కాలనీలోని పి.రాజారావు - గంటా శ్రీనివాసరావు పేరున గల పెదవాల్తేరు సర్వే నెంబర్‌ 10 హెచ్‌ ఐజి ప్లాట్‌ నెంబర్‌ 230-11-4 నివాస భవనం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News