గంటా మార్క్ పాలిటిక్స్ : ఈసారి జిల్లానే మార్చేస్తారా...?

Update: 2022-10-25 11:34 GMT
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. ముఖ్యంగా ఆయన అనుచరులు అయితే ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. రాజధాని కోసం ఒక వైపు ఉద్యమాలు. మరో వైపు  విశాఖ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలకు పదును పెడుతున్న వేళ ఇదే ప్రాంతంలో కేలకంగా ఉన్న గంటా వంటి నేత పెదవి విప్పకుండా ఉండడం పట్ల సొంత పార్టీ వారు కూడా చర్చించుకుంటున్నారు. అయితే గంటా ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. రాజకీయంగా ముందు చూపు ఉన్న నేత.

అందువల్ల ఆయన మౌనంలోనూ ఎన్నో అర్ధాలు, పరమార్ధాలు ఉంటాయని భావించే వారూ ఉన్నారు. గంటా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఉత్తర నియోజకవర్గంలో పెద్దగా తిరగడంలేదు. టీడీపీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడంలేదు. అధినేత పెట్టే సమీక్షలకు సమావేశాలకు ఆయన హాజరుకావడంలేదు.

దాంతో ఆయన టీడీపీకి దూరమే అని అంటున్న వారున్నారు. అదే టైం లో ఆయన వైసీపీలోకి చేరుతారు అని ప్రచారం మూడేళ్ళుగా సాగుతోంది. మొదట్లో అది నిజమనుకున్నా ఇపుడు అధికార పార్టీ హవా తగ్గింది కాబట్టి గంటా అటు వైపు చూడరు అని అంటున్నారు. ఇక గ్రాఫ్ బాగా పెరుగుతున్న మూడవ పార్టీ జనసేన వైపు గంటా చూపు ఉందని మరో కొత్త ప్రచారం మొదలైంది. దాని కోసమే ఆయన ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ని స్వయంగా ఆయన ఇంట్లో కలిశారు అని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే గంటా వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచే పోటీ చేయరని ఇంకో ప్రచారం సాగుతోంది. ఆయన విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలను మార్చారు. ఇక ఆయన ఈ ప్రాంతంలో ఎక్కడ నుంచి పోటీ చేయాలని చూసినా కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. దాంతో ఆయన తన సొంత జిల్లా అయిన ప్రకాశానికి తరలివెళ్తారని అంటున్నారు. అక్కడ నుంచి ఆయన రాజకీయం స్టార్ట్ చేస్తారు అని తెలుస్తోంది.

అక్కడ ఒక సేఫెస్ట్ నియోజకవర్గాన్ని ఆయన ఇప్పటికే సెలెక్ట్ చేసి పెట్టుకున్నరు అని చెబుతున్నారు. ఈ జిల్లాలో టీడీపీకి సీనియర్ల కొరత ఉందని, దాన్ని భర్తీ చేయడానికి గంటా ఆ వైపు వెళ్తారని అంటున్నారు. మరోవైపు ఆయన జనసేన నుంచి పోటీ చేయడానికి కూడా జిల్లా మారుస్తున్నారు అని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి ఈసారి గంటా విశాఖకు గుడ్ బై కొడతారా అన్నదే ఇపుడు వేడి వేడి చర్చగా ఉంది మరి.
Tags:    

Similar News