ఇక్కడ రివర్స్‌ లో వెలివేశారు!

Update: 2017-07-21 16:06 GMT
గరగపర్రు వివాదం రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ ఇప్పట్లో మరచిపోగలిగేది కాదు. అక్కడ నిమ్నజాతుల వారిని అగ్రకులాల వారు సామాజిక బహిష్కరణకు గురిచేసి.. వారి పొట్టకొడుతూ ఉంటే.. సర్కారు మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నది. రోము నగరం తగలబడుతోంటే... నీరో చక్రవర్తి ఫిడీలు వాయించాడన్న సామెత చందంగా.. గరగపర్రులో కులాల మధ్య వైషమ్యాలు ముదురుతూ ఉంటే చంద్రబాబునాయుడు మాత్రం సుద్దులు చెబుతూ, తత్వబోధ చేస్తూ ఉండిపోయారే తప్ప సమస్యను పరిష్కరించలేదు. అక్కడ నిమ్నజాతుల్ని అగ్రవర్ణాల వారు బహిష్కరించారు. కానీ తాజాగా రాజధాని అమరావతిలో సర్కారుకు షాక్ ఇచ్చేలాగా రివర్సులో సామాన్యులే వెలివేశారు.

అయితే ఇది కులాలను వెలివేయడం కాదు. ఏకంగా సర్కారునే వెలివేయడం. తమ కలల్ని చెరిపేసి తమ సిరిసంపదలను కాజేయాలని చూస్తున్న సర్కారీ ప్రయత్నాలకు చెక్ పెట్టే బహిష్కరణ ఇది! కాదు కూడదు అన్న రైతుల నుంచి భూములు లాక్కోడానికి నిరంతరాయ ప్రయత్నాలు చేస్తున్న సీఆర్డీయే వారు తాజాగా నిర్వహించిన సమావేశాన్ని , రైతులే బహిష్కరించారు. ఇదేదో ఆషామాషీగా జరిగింది కాదు.. సదరు సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని దానికి ఎవ్వరూ హాజరు కావద్దని.. తోటి రైతులకు కూడా పల్లె మొత్తం డప్పు కొట్టి మరీ సమాచారం అందించారు.

సీఆర్డీయే నిర్వహించే సమావేశాలకు వెళ్లి, భూముల అప్పగింత విషయంలో తమ అభ్యంతరాలను తెలియజేస్తూ ఉంటే.. అడ్డగోలుగా కేసులు పెట్టి తమను అరెస్టు చేయిస్తున్నారనేది రైతుల వాదన. అందుకే అసలు సమావేశానికి వెళ్లకుండా ఉంటే గొడవ వదిలిపోతుందని వారు భావిస్తున్నారు. పంటభూముల్ని ఇవ్వబోం అంటూ భీష్మించుకున్న రైతుల్ని ఒప్పించడానికి సీఆర్డీయే నిర్వహించిన ఈ సమావేశం.. రైతులు వెలివేయడంతో వెలతెలా పోయింది. సమావేశానికి కేవలం ముగ్గురంటే ముగ్గురే వచ్చారు. ఆ తర్వాత రైతులందరికీ ఫోన్లు చేయించి.. పిలిపిస్తే మరో నలుగురు వచ్చారు. అక్కడకీ.. అధికార్లు తమ ప్రతిపాదనల్ని చెప్పడం ప్రారంభించాక వారు కూడా వెళ్లిపోయారు. కులాల్ని వెలివేసినప్పుడు పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటే వారికి ఎంత కడుపు మండుతుందో, రైతుల బహిష్కరణకు గురై డీలాపడ్డ సర్కారీ అధికార్లకు కూడా స్వానుభవంలోకి వచ్చి ఉంటుంది.
Tags:    

Similar News