బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్న పిచ్చుకలు బెదర్లేదు

Update: 2015-07-15 05:34 GMT
తమ డిమాండ్ల సాధన కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. సమ్మె మంగళవారం కానీ చేస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవు.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. సమ్మె తీవ్రతను మరింత పెంచటానికి కార్మికులు సమాయుత్తం అయితే..సమ్మెను ఏదోలా నియంత్రించటానికి అధికారులు పలు ప్రయత్నాలు చేయటం మంగళవారం కనిపించింది.

సమ్మె చేస్తున్న కార్మికులు కానీ విధుల్లోకి చేరకపోతే.. ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యల గురించి వెల్లడించిన నేపథ్యంలో.. పిచ్చుకలపై బ్రహాస్త్రం ప్రయోగిస్తారా? అన్న ప్రశ్న వినిపించింది. అయితే.. పేరుకు పిచ్చుకులని కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నా.. ప్రభుత్వం ప్రయోగించే బ్రహ్మస్త్రాన్ని ఎదుర్కొవాలనే దృఢ సంకల్పం కార్మికుల్లో కనిపించింది.

సమ్మె చేస్తున్న కొంతమంది ఉద్యోగుల్ని ఒప్పించటం.. ఇతర కార్పొరేషన్.. మున్సిపాలిటీల్లోని కొందరు ఉద్యోగులతో పారిశుద్ధ్య పనుల్ని అధికారులు చేయించారు. సమ్మెకు నేతృత్వం వహిస్తున్న కార్మిక సంఘాల నాయకుల్ని.. పలువురు కార్మికుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని మంగళవారం రాత్రి వరకూ విడుదల చేయలేదు.

ఈ నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అవసరమైతే.. నిరవధిక దీక్షతోపాటు.. ఒక రోజు బంద్ పిలుపునివ్వాలని నిర్ణయించారు. గత తొమ్మిది రోజులుగా సాగుతున్న సమ్మె కారణంగా.. రోడ్లపై చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కురిసిన వర్షాల కారణంగా.. వ్యర్థాల తొలగింపునకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక వైపు వర్షం నీరు.. మరోవైపు పూడికతీత పనులు నిలిపివేయటంతో.. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. దీంతో.. మహానగరంలో పారిశుద్ధ్యం మరింత క్షీణించింది. బ్రహ్మాస్త్ర ప్రయోగానికి సై అంటున్న నేపథ్యంలో సమ్మె ఏ రూపు దాలుస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News