బ్రిటన్ ప్రధాని రిషికి తొలిసారి 'రాజీనామా' షాక్ తగిలింది

Update: 2022-11-10 05:32 GMT
బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన మూలాలు ఉన్న రిషి సనాక్ కు అనూహ్య షాక్ తగిలింది. ప్రధాన మంత్రిగా బాద్యతలు చేపట్టిన తక్కువ వ్యవధిలోనే ఆయన మంత్రివర్గానికి చెందిన మంత్రి గవిన్ విలియమ్స్ తన పదవికి రాజీనామా చేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తోటి ఎంపీలపై నోరు పారేసుకుంటారని.. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారంటూ ఆరోపణలున్న మంత్రి గవిన్ విలియమ్స్ తన పదవి నుంచి వైదొలిగారు.

తాజాగా కన్జర్వేటివ్ పార్టీ మాజీ చీఫ్ విప్ విండీ మోర్టాన్ ను ఆయన బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయనకు మంత్రి చేసిన మెసేజ్ లు బయటకు వచ్చాయి. అందులో మాజీ ప్రధాని లిజ్ టస్ కు సాయపడలేదని.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించకపోవటాన్ని ప్రశ్నిస్తూ విండీకి మంత్రి గవిన్ మెసేజ్ లు పెట్టటం.. అవి కాస్తా బయటకు రావటంతో ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో రాజీనామా చేయక తప్పలేదు.

గతంలోనూ ఆయన్ను మంత్రి పదవి నుంచి రెండుసార్లు తప్పించగా.. తాజా పరిణామంతో ఇప్పటికి మూడుసార్లు మంత్రి అయినప్పటికి.. పదవిని పోగొట్టుకున్నారు. గతంలో రక్షణ మంత్రిగా ఉన్న వేళలోనూ ఉద్యోగుల నాలుక చీరేస్తానని.. కిటికీలో నుంచి బయటకు విసిరేస్తానంటూ నోరు పారేసుకున్నట్లుగా విమర్శలు వచ్చాయి.

కరోనా వేళలో తనకు అప్పగించిన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించని కారణంగా పదవి కోల్పోయారు. తాజాగా తోటి సభ్యులపై నోరు పారేసుకొని మంత్రి పదవి పోగొట్టుకున్నారు.

ఇతగాడి మంత్రి పదవి పోవటం ఎలా ఉన్నా.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళలో పదవీ బాధ్యతలు చేపట్టిన భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రభుత్వానికి తాజా పరిణామం ఇబ్బందికరంగా మారుతుందనంటున్నారు.

ఇప్పటికే వివాదాలు ఉన్న వారిని అసలు కేబినెట్ లోకి తీసుకోకుండా ఉండాల్సిందని.. అందుకు భిన్నంగా తీసుకోవటం ద్వారా విమర్శలు ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా రాజీనామా తో షాక్ తగిలినట్లేనని చెబుుతన్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారికి పదవుల్ని అప్పజెప్పకపోవటం రిషికి మంచిదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News