ఇకపై రోజూ ఇదే బ్రాండ్ తాగుతా: ఎక్సయిజ్ మంత్రి

Update: 2018-01-29 16:17 GMT
ఏపీ ఎక్సయిజ్ మంత్రి జవహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ఈ బ్రాండే తాగుతానంటూ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో స్వయంగా చెప్పారు....ఆశ్చర్యపోవద్దు ఆయన చెప్పింది మీరనుకుంటున్నట్లు మద్యం గురించి కాదు - అసలు సిసలైన అరకు కాఫీ గురించి. అవును.. చంద్రబాబు ప్రభుత్వం అరకు కాఫీకి బ్రాండింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్టణంలోని అరకు వ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ ప్యాకెట్లను ఈరోజు మార్కెట్లోకి విడుదల చేశారు. ఏపీ సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏపీ సాంఘిక - గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఈ ప్యాకెట్లను విడుదల చేశారు. మంత్రి జవహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అరకు కాఫీని తాగి ఆ రుచిని మెచ్చుకుంటూ ఇకపై ఈ కాఫీయే తాగుతానని తెలిపారు.
    
అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ 2 గ్రాములు - 10 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్ కు విడుదల చేసిన సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, ఈ కాఫీని ప్రజలు సేవించి, రుచి చూడాలని గిరిజనులను ఆదుకోవాలని అన్నారు. గిరిజన ఉత్పత్తులతోపాటు కాఫీ గింజలను సేకరించి - ప్రాసెసింగ్ చేయించి - మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) లక్ష్యమని అన్నారు. అరకువ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ 2 గ్రాముల ప్యాకెట్లు 4 లక్షలు - 10 గ్రాముల ప్యాకెట్లు లక్ష విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నట్లు చెప్పారు.
    
అనంతరం, మంత్రి జవహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకు కాఫీ రుచిని ప్రపంచానికి పరిచయం చేశారని, పోడు, గంజాయి సాగు చేసుకునే గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని, గిరిజన కుటుంబాలు నెలకు రూ.10 వేలు సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆనందబాబు, జవహర్ అరకు కాఫీ తాగారు. దీని రుచి బాగుందని, ఇకపై ఈ కాఫీనే రోజూ తాగుతానని జవహర్ పేర్కొన్నారు.
Tags:    

Similar News