భారత్ లో భారీగా కొనే ఫోన్ కంపెనీల్ని బ్యాన్ చేసిన జర్మనీ

Update: 2022-07-12 09:30 GMT
భారత్ లో పెద్ద ఎత్తున అమ్ముడయ్యే సెల్ ఫోన్ల కంపెనీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిల్లో అత్యధికం చైనాకు చెందిన స్మార్ట్ ఫ్లోనే సింహభాగం. అందులో ఒకటి ఒప్పో. ఈ సంస్థకు చెందిన పలు సెల్ ఫోన్లు.. వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో అమ్ముడవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒప్పో.. వన్ ప్లస్ ఫోన్లు ఉన్నాయి. అయితే.. ఈ ఫోన్లను జర్మనీలో అమ్మేందుకు వీల్లేకుండా బ్యాన్ విధించారు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.

నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపిన మాన్ హీమ్ ప్రాంతీయ న్యాయస్థానం ఒప్పో.. వన్ ప్లస్ పై జర్మనీలో బ్యాన్ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కోర్టు తీర్పుతో ఒప్పో.. వన్ ప్లస్ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని జర్మనీలో ఎప్పటికి అమ్మకాలు జరపలేవని చెబుతున్నారు.

ఇంతకూ ఈ ఉదంతంలో నెలకొన్న వివాదం ఏమిటి? ఎందుకింత కఠిన నిర్ణయాన్ని కోర్టు వెలువరించిందన్న విషయాన్ని చూస్తే.. ప్రఖ్యాత నోకియా కంపెనీ వేసిన పేటెంట్ కేసులే కారణంగా చెబుతున్నారు.

నోకియా కంపెనీ 5జీ నెట్ వర్క్ లో వైఫై కనెక్షన్ ను స్కానింగ్ చేసే టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ కలిగి ఉంది. దీని కోసం నోకియా దగ్గర దగ్గర 129 బిలియన్ యూరోల (రూ.1.02 వేల కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఇదిలా ఉంటే ఒప్పో.. వన్ ప్లస్ కంపెనీలు నోకియాతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా.. దాని నుంచి లైసెన్స్ తీసుకోకుండా ఈ టెక్నాలజీని వాడేస్తున్నారన్నది నోకియా ఆరోపణ.

ఇందులో భాగంగా నోకియా 2021 జులైలో ఆసియా.. యూరోప్ లలోని పలు దేశాల్లో కేసులు నమోదు చేసింది. ఒప్పో తమతో 2018 నవంబరులో చేసుకున్న ఒప్పందం 2021 జూన్ తో ముగిసినట్లు కంప్లైంట్ లో పేర్కొంది. లైసెన్సును రెన్యువల్ చేసుకోవాలని చెబితే దాన్ని కూడా ఒప్పో రిజెక్టు చేసినట్లుగా నోకియా వాదనగా చెబుతున్నారు. అయితే.. ఒప్పో వాదన మరోలా ఉంది.

తాము తమ సొంత.. థర్డ్ పార్టీలకు చెందిన మేథో సంపత్తి హక్కుల్ని గౌరవిస్తామని పేర్కొంది. కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు చెప్పింది. ఆసక్తికకరమైన విషయం ఏమంటే నోకియా కంపెనీకి ఒక అలవాటు ఉంది. ఏదైనా సంస్థపై ఆ సంస్థ కేసు వేస్తే.. గెలుపు వారి పక్షాన ఉంటుందని చెబుతారు. గతంలో ఇలాంటి అనుభవమే యాపిల్.. లెనోవాల విషయంలోనూ జరిగిందని చెబుతారు. కేసు ఓడిన తర్వాత నోకియాతో కలిసి యాపిల్ కొత్త టెక్నాలజీ కోసం పని చేయటం గమనార్హం. తాజా ఉదంతంలో మరేం జరుగుతుందో చూడాలి. 
Tags:    

Similar News